ఎలెన్‌ మస్క్‌ తైవాన్ శాంతి ప్రతిపాదన...పొగడ్తలతో ముంచెత్తిన చైనా

10 Oct, 2022 10:31 IST|Sakshi

వాషింగ్టన్‌: యూఎస్‌లోని చైనా రాయబారి క్విన్‌ గ్యాంగ్‌ టెస్లా దిగ్గజం ఎలెన్‌ మస్క్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల చైనా తైవాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఎలెన్‌ మస్క్‌ ఒక శాంతి ప్రతిపాదనను సూచించారు. ఈ నేపథ్యంలోనే చైనా రాయబారి ఎలెన్‌మస్క్‌కి థ్యాంక్స్‌ చెప్పారు. ఈ మేరకు ఎలెన్‌ మస్క్‌ ఫైనాన్షియల్‌ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో... తైవాన్‌ను చైనా ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్‌ జోన్‌గా మార్చవచ్చని ఒక సలహ ఇచ్చారు.

దీంతో చైనా రాయబారి ట్విట్టర్‌లో... ఒక దేశం రెండు వ్యవస్థలుగా తైవాన్‌ సమస్యను తీర్చే మీ సలహ ఉత్తమైమనది అని ప్రశంసించారు. ఇది చాలా శాంతియుత పునరేకికరణ అంటూ ఎలెన్‌ మస్క్‌ని ప్రశంసించారు. ఐతే చైనా సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలకు హామీ ఇచ్చినట్లయితే తైవాన్‌ పునరేకీకరణ తర్వాత ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా స్వయం ప్రతిపత్తిని, అభివృద్ధిని పొందుగలుగుతుందని  క్విన్‌ గ్యాంగ్‌ ట్వీట్‌ చేశారు. ఐతే ఎలెన్‌ మస్క్‌ సలహ తైవాన్‌ ప్రజలకు నచ్చలేదు, పలు తైవాన్‌ రాజకీయ పార్టీలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి.

అంతేగాదు మస్క్‌ వ్యాఖ్యలు జాతీయ సార్వభౌమాధికారాన్ని ఉల్లఘించడమే కాకుండా ప్రజాస్వామ్యానికి హాని కలిగించేవని తైవాన్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధికార ప్రతినిధి హువాంగ్‌త్సాయ్‌ పేర్కొన్నారు. అయినా మస్క్‌కి చైనాలో పలు వ్యాపారాలు ఉన్నాయని అందువల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతోంది తైవాన్‌. మరోవైపు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాత్రం  తైవాన్ విషయంలో విదేశీ శక్తుల జోక్యాన్ని చైనా అంగీకరించదని దృఢంగా చెప్పడం విశేషం.

(చదవండి: క్రిమియా వంతెన బాంబు దాడి: ఉగ్రవాదమన్న పుతిన్‌.. ఉక్రెయిన్‌ ఘాటు కౌంటర్‌)
 

మరిన్ని వార్తలు