రష్యాకు చైనా మద్దతు.. ‘నాటో అటువైపునకు వెళ్లకపోవడమే మంచిది’

20 Mar, 2022 13:07 IST|Sakshi

బీజింగ్‌: ప్రపంచంలో తూర్పు భాగంవైపు విస్తరించబోమంటూ గతంలో ఇచ్చిన హామీకి ‘నాటో’ కట్టుబడి ఉండాలని చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి లీ యూచెంగ్‌ డిమాండ్‌ చేశారు. తూర్పు వైపు విస్తరణ ఆకాంక్షను వదులుకోవాలని నాటోకు హితవు పలికారు. ఆయన శనివారం బీజింగ్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడాన్ని ఖండించారు.

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి మూలాలు ప్రచ్ఛన్న యుద్ధంలో, ఆధిపత్య రాజకీయాల్లో ఉన్నాయని స్పష్టం చేశారు. ఒకవేళ నాటో గనుక తూర్పు వైపు విస్తరిస్తే అది రష్యా శివార్లకు చేరుతుందని పేర్కొన్నారు. రష్యా భద్రతకు అది క్షేమకరం కాదని వెల్లడించారు. అందుకే నాటో విస్తరణ లక్ష్యానికి ముగింపు పలకాలని అన్నారు. రష్యా వైపు వెళ్లకుండా యుగోస్లోవియా, ఇరాక్, సిరియా, అఫ్గానిస్తాన్‌ దేశాల్లో భద్రతను పటిష్టం చేయాలని సూచించారు. 
(చదవండి: కుప్పకూలిన నాటో విమానం.. ‘ఉక్రెయిన్‌–రష్యా యుద్ధంతో సంబంధం లేదు’)

మరిన్ని వార్తలు