తైవాన్‌పై దాడికి చైనా కుట్ర!

19 Oct, 2020 05:48 IST|Sakshi
మిలిటరీ దుస్తుల్లో జిన్‌పింగ్‌ (ఫైల్‌)

బీజింగ్‌: తైవాన్‌ను ఆక్రమించేందుకు మిలటరీ చర్యకు చైనా సిద్ధమవుతోందని మిలటరీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆగ్నేయ తీరంలో చైనా భారీగా అత్యాధునిక ఆయుధాలను, సైనిక బలగాలను మోహరిస్తుండటంతో తైవాన్‌పై దాడికే ఈ మోహరింపు అని వివరిస్తున్నారు. ‘సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ పత్రిక కథనం ప్రకారం.. ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ఉన్న పాత డీఎఫ్‌ 11, డీఎఫ్‌ 15 క్షిపణుల స్థానంలో ఆధునిక ఢీఎఫ్‌ 17 క్షిపణులను చైనా మోహరిస్తోంది. ఈ ఆధునిక హైపర్‌సోనిక్‌ క్షిపణి అత్యంత కచ్చితంగా శత్రు లక్ష్యాలను చేధిస్తుంది.

స్వీయ పాలనలో ఉన్న ద్వీప దేశం తైవాన్‌ను తన నియంత్రణలోకి తీసుకునేందుకు చైనా చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. తైవాన్‌ చైనాలో అంతర్భాగమని వాదిస్తోంది. తైవాన్‌ను ఆక్రమించేందుకు అవసరమైతే మిలటరీ చర్యకు వెనుకాడబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. గ్వాంగ్‌డాంగ్, ఫ్యుజియన్‌ ప్రాంతాల్లో చైనా బలగాల, ఆయుధ వ్యవస్థల్లో భారీ పెరుగుదల కనిపిస్తోందని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా కెనడాకు చెందిన ‘కన్వా డిఫెన్స్‌ రివ్యూ’ పేర్కొంది. తైవాన్‌ లక్ష్యంగా యుద్ధం చేసేందుకు తూర్పు, దక్షిణ కమాండ్స్‌ల క్షిపణి వ్యవస్థలను చైనా ఇటీవల రెట్టింపు స్థాయిలో బలోపేతం చేసిందని వెల్లడించింది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సైనిక దళాలకు మంగళవారం చైనా అధ్యక్షుడు పిలుపిచ్చిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు