ఎవరికీ రాని ఆలోచనలు జిన్‌పింగ్‌కే ఎందుకొస్తాయో.. తిట్టిపోస్తున్న చైనీయులు!

19 Sep, 2022 11:48 IST|Sakshi

బీజింగ్‌: మంకీపాక్స్‌ వైరస్‌ సోకకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని తమ ప్రజలకు చైనా వైద్య నిపుణులు సూచించారు. విదేశీయులను, విదేశాల నుంచి వచ్చిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ తాకవద్దని చెప్పారు. చైనాలోని తొలి మంకీపాక్స్‌ కేసు చాంగ్‌ఖింగ్‌ సిటీలో శుక్రవారం బయటపడింది.

ఈ నేపథ్యంలో చైనాలో పేరుగాంచిన అంటువ్యాధుల నిపుణుడు వూ జున్‌యూ పలు సూచనలు జారీ చేశారు. స్కిన్‌ టు స్కిన్‌ కాంటాక్టు వల్ల  మంకీపాక్స్‌ సోకుతుందని, అందుకే విదేశీయులను, ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిని ముట్టుకోవద్దని తెలియజేశారు. అయితే, వూ జున్‌యూ సూచనలపై చైనాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవి జాత్యహంకారాన్ని, జాతి వివక్షను ప్రోత్సహించేలా ఉన్నాయని జనం విరుచుకుపడుతున్నారు. అటు సోషల్‌ మీడియాలో సైతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే.. చైనాలో ఇప్పటికీ కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా,  చైనాలో ఇటీవల మంకీపాక్స్‌ తొలి కేసు నమోదైంది. విదేశాల నుంచి ఇక్కడి చాంగ్‌క్వింగ్‌ నగరానికి చేరుకున్న ఓ వ్యక్తి.. కొవిడ్‌తో క్వారంటైన్‌లో ఉన్న సమయంలోనే మంకీపాక్స్‌ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలోనే విదేశీయులను తాకవద్దంటూ సూచనలు చేశారు.

మరిన్ని వార్తలు