రణిల్ విక్రమసింఘేకు జిన్‍పింగ్‌ మద్దతు.. సాయం చేస్తామని హామీ

22 Jul, 2022 18:19 IST|Sakshi
జిన్‌పింగ్‌

బీజింగ్‌: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్ విక్రమ సింఘేకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంక త్వరలోనే వాటి నుంచి బయటపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లంక ఆర్థికంగా, సామాజికంగా కోలుకుంటుందని, చైనా నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ వెల్లడించింది.

శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభ పరిస్థితికి ఆ దేశం  చేసిన అప్పులే ప్రధాన కారణం. చైనాకు లంక దాదాపు 5 బిలియన్‌ డాలర్ల అప్పు ఉంది. కానీ వాస్తవానికి అది 10 బిలియన్‌ డాలర్లు అయి ఉంటుందనే అంచనాలున్నాయి. చైనా తర్వాత భారత్‌కు 3.8 బిలియన్ డాలర్లు రుణపడి ఉంది లంక. జపాన్‌కు కూడా 3.5 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సి ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి వివరాల ప్రకారం మరో బిలియన్ డాలర్లు ఇతర సంపన్న దేశాల నుంచి రుణంగా తీసుకుంది. దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడే పరిస్థితి తెచ్చుకుంది.

గొటబాయ రాజపక్స రాజీనామా అనంతరం రణిల్ విక్రమ సింఘే గురువారం నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. లాయర్‌ అయిన ఆయనకు ఆరు సార్లు ప్రధానిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే శ్రీలంక ప్రజలు మాత్రం రణిల్ విక్రమ సింఘేను కూడా వ్యతిరేకిస్తున్నారు.  కొద్ది నెలలుగా లంకేయులు చేస్తున్న ఆందోళనలకు భయపడి గొటబాయ గతవారమే దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
చదవండి: చేతులెత్తేస్తున్న రష్యా సైన్యం.. కోలుకోలేని దెబ్బకొట్టేందుకు ఉక్రెయిన్ సిద్ధం!

మరిన్ని వార్తలు