అఫ్గనిస్తాన్‌ ఆక్రమణ: అమెరికాకు చైనా చురకలు

24 Aug, 2021 11:14 IST|Sakshi

తాలిబన్‌ పాలన నుంచి మళ్లీ తాలిబన్‌ పాలనే

20 ఏళ్లలో అమెరికా సాధించింది ఇదే: చైనా

బీజింగ్‌: తాలిబన్ల ఆక్రమణతో అఫ్గనిస్తాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స‌రిగ్గా 20 ఏండ్ల క్రితం ఆల్‌ఖైదాను, దానికి ఆశ్ర‌యం క‌ల్పించిన తాలిబ‌న్ల‌ను మ‌ట్టుబెట్టే ల‌క్ష్యంతో అఫ్గానిస్తాన్‌లో 2001లో సైనిక చ‌ర్య‌కు దిగింది. ఇక అనుకున్న పని పూర్తి చేసిన అగ్ర రాజ్యం అప్పటి నుంచి ఆఫ్ఘనిస్ధాన్‌ని తాలిబన్ల నుంచి కాపాడుతూ వచ్చింది. కొన్ని కారణాల వల్ల అమెరికా సేనలు అఫ్గానిస్తాన్ వీడగానే తక్షణమే తాలిబ‌న్లు శ‌ర‌వేగంగా అఫ్గన్‌ను కైవ‌సం చేసుకున్నారు. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అమెరికానే కారణం అని చైనా ఆరోపించింది. ఈ మేరకు డ్రాగన్‌ జాతీయా మీడియాజిన్హువా న్యూస్ ఏజెన్సీలో ఓ వీడియోని విడుదల చేసింది. 

మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో  ‘‘జీవితం ఎటూ కదలడం లేదని మీకు అనిపిస్తుంది.. అయితే ఒక్కసారి ఆలోచించండి నలుగురు అధ్యక్షులు.. 20 ఏళ్లు.. 2 ట్రిలియన్‌ డాలర్లు.. 2300 మంది సైనికులు జీవితాలు.. పణంగా పెట్టి అఫ్గన్‌లో తాలిబన్ల పాలన నుంచి తిరిగి తాలిబన్ల పాలనకే చేరుకుంది’’ అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేసింది. ఇక యాంకర్‌ కూడా వేళాకోళం చేసే తరహాలోనే మాట్లాడుతుంది. అంతేకాక అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ చెసిన అమెరికా ఈజ్‌ బ్యాక్‌ అనే వ్యాఖ్యలు నిజం అయ్యాయి అంటూ ఎగతాళి చేస్తుంది. (చదవండి: అమెరికాకు డెడ్‌లైన్‌ విధించిన తాలిబన్లు)

‘‘అధ్యక్ష భవనాన్ని తాలిబాన్ దళాలు స్వాధీనం చేసుకోవడంతో ఖాళీ చేయడానికి అమెరికా ట్రూప్స్‌ తర్జనభర్జనలు పడ్డారు’’ అని వీడియోలో పేర్కొంది. ఉగ్రవాద నిరోధక చర్యల పేరుతో అమెరికా అఫ్గన్‌లో యుద్ధాన్ని రాజేసిందని చైనా విమర్శించింది. అంతేకాక ఈ 20 ఏళ్లలో అమెరికా సాధించిన అభివృద్ధి ఏంటంటే అఫ్గన్‌లో  ఉగ్రమూకల సంఖ్యను సింగిల్‌ డిజిట్‌ నుంచి 20 వరకు పెంచింది అని చైనా ఎద్దేవా చేసింది. (చదవండి: అమెరికా చేసిన పొరపాట్లే.. అఫ్గానిస్తాన్‌కు శాపమా?)

అమెరికా చర్యల వల్ల అఫ్గనిస్తాన్‌లో ఇప్పటి వరకు  లక్ష  మంది చనిపోయారు.. అంతకుమించి గాయపడ్డారు. దాదాపు 11 లక్షల మంది రోడ్డునపడ్డారు. ఈ యుద్ధం ఒక్కరోజు ఖరీదు 60 మిలియన్ల డాలర్లు(రూ.4,44,78,30,000). వియాత్నం యుద్ధం కన్నా ఎక్కువ నష్టాన్ని మిగిల్చింది అని చైనా వీడియోలో ఆరోపించింది.
 

మరిన్ని వార్తలు