సంచలన ఆరోపణలు చేసిన లి మెంగ్‌ యాన్‌

23 Sep, 2020 09:21 IST|Sakshi

బీజింగ్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌లోనే తయారయ్యిందంటూ సంచలన ప్రకటన చేసిన చైనా వైరాలజిస్ట్‌ లి మెంగ్‌ యాన్‌ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి చైనా ప్రభుత్వానికి తెలుసన్న యాన్‌.. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని కవర్‌ చేయడానికి తెగ ప్రయత్నించిందని ఆరోపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాన్‌ మాట్లాడుతూ.. ‘ఈ వైరస్‌ను వూహాన్‌ ల్యాబ్‌లో సృష్టించారు. దీని వ్యాప్తి గురించి చైనాకు ముందే తెలుసు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాపై నింద పడకుండా కవర్‌ చేయడానికి తెగ ప్రయత్నించింది. ఈ విషయాన్ని నిరూపించడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను ఈ విషయాలను వెల్లడించడంతో చైనా ప్రభుత్వం సోషల్‌ మీడియా ద్వారా నన్ను బెదిరించాలని చూస్తోంది. నా కుటుంబాన్ని భయపెట్టడమేకాక.. నా మీద సైబర్‌ దాడులు చేయడానికి ప్రయత్నిస్తుంది’ అన్నారు. (చదవండి: కరోనా పుట్టిల్లు వూహాన్‌ ప్రయోగశాలే)

అంతేకాక ‘ఈ వైరస్‌ ఫుడ్‌ మార్కెట్‌ నుంచి కాక ల్యాబ్‌ నుంచి వచ్చింది. అందుకు నా దగ్గర ఆధారాలున్నాయి. చైనా ప్రభుత్వం దీన్ని ఎందుకు సృష్టించిందో.. ఎందుకు బయటకు వదిలిందో ప్రజలకు తెలపాలనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ఆధారాలు ఎవరైనా అర్థం చేసుకోగలరు. వైరస్‌ జన్యుశ్రేణి మానవవేలిముద్రలాగా ఉంటుంది’ అని యాన్‌ తెలిపారు. వూహాన్‌లో కొత్తగా న్యూమోనియా ప్రబలడంపై విచారించాల్సిందిగా తనని ప్రభుత్వం కోరిందనీ, ఆ విచారణలో భాగంగా ఈ వైరస్‌ను దాచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలు తన దృష్టికి వచ్చినట్లు ఆమె వెల్లడించారు. ఈమె హాంకాంగ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో వైరాలజీ, ఇమ్యునాలజీలో శాస్త్రవేత్త. డిసెంబర్‌– జనవరిలో తొలిసారి, జనవరి మధ్యలో మరోమారు డాక్టర్‌ లీ మెంగ్‌ చైనాలో న్యూమోనియాపై రెండు పరిశోధనలు చేశారు.(చదవండి: ఐరాసను సంస్కరించాల్సిన తరుణమిదే!)

తరువాత యాన్‌ హాంకాంగ్‌ నుంచి అమెరికా పారిపోయారు. తన సూపర్‌వైజర్‌ అయిన డబ్ల్యూహెచ్‌వో కన్సల్టెంట్‌తో ఈ విషయం చెప్పాలని భావించాననీ, కానీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదని ఆమె తెలిపారు. తన పరిధి దాటి వ్యవహరించడం సరికాదని, లేదంటే తాను అదృశ్యమవడం ఖాయమని, అంతా తనను హెచ్చరించినట్టు ఆమె వెల్లడించారు. ఆమె ట్విట్టర్‌ అకౌంట్‌ని సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు