Chinook Helicopter: నాన్‌స్టాప్‌గా ప్రయాణించిన హెలికాప్టర్‌గా రికార్డు

12 Apr, 2022 09:10 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ నాన్‌స్టాప్‌గా ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఈ హెలికాప్టర్‌ సోమవారం చండీగఢ్ నుంచి అస్సాంలోని జోర్హాట్ వరకు ఏడున్నర గంటలపాటు 1910 కి.మీ ప్రయాణించి సుదీర్ఘమైన నాన్ స్టాప్ హెలికాప్టర్ సోర్టీగా రికార్డు సృష్టించిందని రక్షణ అధికారులు తెలిపారు. చినూక్‌ హెలికాప్టర్‌ సామర్థ్యం తోపాటు వైమానికదళం కార్యాచరణ, ప్రణాళిక అమలుతోనే ఈ రికార్డు సాధ్యమైందని రక్షణ ప్రతినిధి పేర్కొన్నారు.

ఇది యుద్ధరంగంలో బహువిధాలుగా సేవలందించనుందని తెలిపారు. ఈ హెలికాప్టర్‌ దళాలను, ఫిరంగులు, యుద్ధ సామాగ్రి, ఇంధనాన్ని రవాణ చేయడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. మానవతా విపత్తు సహాయ కార్యకలాపాల్లో ముఖ్య భూమిక పోషించనుందని తెలిపారు. శరణార్థులను పెద్దఎత్తున తరలించడం వంటి మిషన్లలో కూడా ఉపయోగపడునుందని చెప్పారు.

భారత వైమానిక దళం అవసరమైన మేరకు హెలికాప్టర్‌ను సముచితంగా మోహరించేందుకు వీలు కల్పిస్తుందని రక్షణ అధికారి తెలిపారు. అంతేకాదు దాని వేగవంతమైన మొబిలిటీ అవసరమైన విధంగా వినియోగించుకునే సౌలభ్యం కూడా ఉందని పేర్కొన్నారు. అయితే భారత్‌ 22 అపాచీ హెలికాప్టర్లు, 15 చినూక్స్ ఛాపర్‌లను అమెరికా నుండి కొనుగోలు చేసేందుకు 2015లో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.

(చదవండి: గాలిలో ప్రాణాలు)

మరిన్ని వార్తలు