ఐదేళ్ల చిన్నారి.. 3200 కిలోమీటర్లు సైక్లింగ్‌ చేసి

28 Jul, 2020 15:14 IST|Sakshi

లండన్‌: సాయం చేయాలనుకునే వారికి ఎదుటి వారి కష్టాలు చూసి స్పందించే మనసు ముఖ్యం. ఇతరులకు మంచి  చేయాలనే ఆలోచన ఉంటే చాలు.. ఏదో ఓ రకంగా మనం తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. దీనికి వయసుతో పని లేదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాడు ఓ ఐదేళ్ల చిన్నారి. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అ‍ల్లకల్లోలం చేస్తోంది. వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో ఎందరో రోడ్డున పడ్డారు. తినడానికి తిండి లేక నానా తిప్పలు పడ్డారు. ఇలాంటి కష్టకాలంలో అన్నార్తులను ఆదుకునేందుకు ఎందరో ముందుకు వచ్చారు. తోచిన సాయం చేశారు. మాంచెస్టర్‌లో ఉంటున్న చిత్తూరు జిల్లాకు చెందిన అనీశ్వర్‌ కుంచాలా అనే ఐదేళ్ల చిన్నారికి కూడా సాయం చేయాలనే కోరిక కలిగింది. తనేమో ఇంకా చిన్న పిల్లాడే. సాయం చేయాలనుకుంటే తన పిగ్గి బ్యాంక్‌లో ఉన్న డబ్బును ఇచ్చేసి ఊరుకోవచ్చు. కానీ అనీశ్వర్‌ భారీ మొత్తంలో సాయం చేయాలనుకున్నాడు. (ఇవి ఎవరికి ఇవ్వాలో సలహా ఇవ్వండి: ఉపాసన)

ఈ క్రమంలో సర్‌ థామస్‌ మూర్‌ అనే 100 ఏళ్ల వృద్ధుడు అనీశ్వర్‌కు ఓ మార్గం చూపించాడు. యూకేలో కరోనాతో బాధపడేవారికి వైద్యం అందించడం కోసం 100 ఏళ్ల వయసులో థామస్‌ మూర్‌ ఓ సర్కిల్‌ చుట్టు 100 రౌండ్లు నడిచి విరాళాలు సేకరించాడు. ఈ సంఘటనతో స్ఫూర్తి పొందిన అనీశ్వర్‌‌.. మరో 60 మంది పిల్లలతో కలిసి ‘లిటిల్‌ పెడలర్స్‌ అనీశ్వర్‌ అండ్‌ ఫ్రెండ్స్‌’ పేరుతో మేలో ఓ బృందాన్ని ఏర్పాటు చేశాడు. వీరంతా కలిసి దాదాపు 3200 కిలోమీటర్ల దూరం సైకిల్‌ తొక్కి కరోనా బాధితుల కోసం విరాళాలు సేకరించాడు. ఇలా మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు సాధించాడు. ఈ మొత్తాన్ని కరోనాపై పోరు సాగిస్తున్న భారత్‌కు అందించాడు. ప్రస్తుతం యూకేకు సాయం చేయడం కోసం క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభించాడు అనీశ్వర్‌. (అందం.. సేవానందం..)

ప్రస్తుతం ఈ చిన్నారి ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీ బ్రిటీష్‌ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ అనీశ్వర్‌ ఆశయాన్ని తెగ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిన్నారి యూకేలో సెలబ్రిటీ అయ్యాడు. బ్రిటీష్‌ రాజకీయ నాయకులు అనీశ్వర్‌ను కలిసి.. ప్రశంసిస్తున్నారు. వారింగ్టన్‌ సౌత్‌ ఎంపీ ఆండీ కార్టర్‌ అనీశ్వర్‌ ఆశయాన్ని మెచ్చుకున్నారు. మరో ఎంపీ షార్లెట్ మేనేజర్ ఆగస్టు 6న అనీశ్వర్‌ను కలవనున్నారు.

మరిన్ని వార్తలు