డ్రాగన్‌ చైనా వల్లే లంకేయులకు ఈ గతి.. ప్రపంచ దేశాలకు ఇదే హెచ్చరిక!

21 Jul, 2022 12:29 IST|Sakshi

వాషింగ్టన్‌: శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ పతనానికి చైనానే కారణమని అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ(సీఐఏ) చీఫ్‌ విలియమ్‌ బర్న్స్‌ ఆరోపించారు. చైనా పెట్టుబడులపై కొలంబో 'మూగ పందాలు' వేసిందని, అదే విపత్తు పరిస్థితులకు దారి తీసిందన్నారు. ఆస్పెన్‌ సెక్యూరిటీ ఫోరమ్‌లో మాట్లాడారు సీఐఏ చీఫ్‌. ‘చైనీయులు తమ పెట్టుబడుల కోసం ముందు ఆకర్షనీయమైన చర్యలు చేపడతారు. ఆ తర్వాతే అసలు విషయం బయటకు వస్తుంది. చైనా వద్ద భారీగా అప్పులు చేసిన శ్రీలంక పరిస్థితులను ప్రపంచ దేశాలు ఓసారి చూడాలి. వారు తమ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై మూగ పందాలు వేశారు. ఇప్పుడు విపత్తు వంటి పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్నారు. దాని ద్వారా ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి దారి తీసింది.’ అని పేర్కొన్నారు. 

మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలోని దేశాలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు సైతం శ్రీలంక పరిస్థితులు ఒక గుణపాఠం అని పేర్కొన్నారు సీఐఏ చీఫ్‌. చైనాతో శ్రీలంక ఏ విధంగా వ్యవహరించిందే ఓసారి పరిశీలించాలని సూచించారు. చైనాతో పాటు చాలా దేశాల నుంచి శ్రీలంక అప్పులు చేసిందని గుర్తు చేశారు. 2017లో 1.4 బిలియన్‌ డాలర్ల రుణాలను చెల్లించలేని పరిస్థితుల్లో ఓ పోర్టును చైనాకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చిందని గుర్తు చేశారు. 21వ శతాబ్దంలో భౌగోళికంగా అమెరికాకు చైనానే ఏకైక సవాలుగా పేర్కొన్నారు. 

తాహతకు మించి అప్పులు చేస్తున్న దేశాలు శ్రీలంకను చూసి గుణపాఠం నేర్చుకోవాలని ఐఎంఎఫ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జివా గత శనివారం హెచ్చరించారు. ఆయా దేశాలకు ఇదొక హెచ్చరికగా పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌ హెచ్చరిక చేసిన కొద్ది రోజుల్లోనే సీఐఏ చీఫ్‌ ఈ వాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. 1948, స్వాతంత‍్య్రం సాధించిన తర్వాత శ్రీలంక ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సరైన ఆహారం, ఔషదాలు, వంట గ్యాస్‌, చమురు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు.

అధ్యక్షుడిగా విక్రమ సింఘే ప్రమాణం.. 
గొటబయ రాజపక్స స్థానంలో అధ్యక్షుడిగా ఎన్నికైన రణీల్‌ విక్రమ సింఘే.. పార్లమెంట్‌లో జరిగిన కార్యక్రమంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి ఆయన చేత ప్రమాణం చేయించారు. బుధవారమే విక్రమ సింఘేను తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకుంది పార్లమెంట్‌. సింఘేకు 134 ఓట్లు వచ్చాయి.

ఇదీ చదవండి: Sri Lanka Crisis: శ్రీలంకలో మానవ హక్కులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన 

మరిన్ని వార్తలు