చైనా, తైవాన్‌ మధ్య యుద్ధ మేఘాలు! పెలోసీ పర్యటనపై డ్రాగన్‌ కంట్రీ కన్నెర్ర

4 Aug, 2022 05:14 IST|Sakshi
తైవాన్‌ అధ్యక్షురాలు సై ఇంగ్‌ వెన్‌తో పెలోసీ(ఎడమ)

నిప్పుతో చెలగాటమని వ్యాఖ్య 

మూల్యం తప్పదని హెచ్చరికలు

అమెరికా రాయబారికి సమన్లు

తైవాన్‌పై ఆంక్షల పరంపర

బలప్రయోగానికి సన్నాహాలు!

తైపీ: చైనాను రెచ్చగొడుతూ, ఉద్రిక్తతలను మరింతగా పెంచుతూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ (82) తైవాన్‌ పర్యటన బుధవారం ముగిసింది. ‘‘తైవాన్‌కు అమెరికా అన్నివిధాలా అండగా నిలుస్తుంది. అందుకు మేం కట్టుబడ్డామని ఈ పర్యటనతో మరోసారి చాటిచెప్పాం’’ అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. తైవాన్‌ తన భూభాగమేనని, దానితో ఏ దేశమూ సంబంధాలు పెట్టుకోరాదని చెబుతున్న చైనా ఈ పరిణామంపై మండిపడింది.

‘‘పెలోసీ నిప్పుతో చెలగాటమాడారు. అది అమెరికానే కాల్చేస్తుంది.  తీవ్ర పరిణామాలుంటాయి. చేతులు ముడుచుకుని కూర్చోం’’ అంటూ చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి జీ ఫెంగ్‌ స్పందించారు. ఈ తప్పిదానికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘‘చైనా సార్వభౌమాధికారాల పరిధిని, ప్రాదేశిక సమగ్రతను అమెరికా ఉల్లంఘించింది. తైవాన్‌ జలసంధి వద్ద శాంతిభద్రతలను పూర్తిగా దెబ్బతీసింది’’ అని విమర్శించారు.

‘‘చైనాను నిలువరించేందుకు తైవాన్‌ అంశాన్ని వాడుకోవడాన్ని అమెరికా ఇకనైనా కట్టిపెట్టాలి. తైవాన్‌ స్వాతంత్య్ర డిమాండ్లకు మద్దతివ్వొద్దు’’ అని డిమాండ్‌ చేశారు. చైనాలోని అమెరికా రాయబారి నికోలస్‌ బర్న్స్‌ను మంగళవారం రాత్రి పిలిపించి పెలోసీ పర్యటనపై తీవ్ర అభ్యంతరం, అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనాతో కయ్యానికి కాలు దువ్వొద్దని హెచ్చరించారు. తైవాన్‌పై ఆంక్షలకూ చైనా తెర తీసింది. పళ్లు, చేపల దిగుమతులు, ఇసుక ఎగుమతులపై నిషేధం విధించింది.

నిబద్ధత చాటుకున్నాం: పెలోసీ
దక్షిణ కొరియా బయల్దేరే ముందు తైవాన్‌ అధ్యక్షురాలు సై ఇంగ్‌ వెన్‌తో పెలోసీ భేటీ అయ్యారు. తైవాన్‌లోనూ, ప్రపంచంలో ఇతర చోట్లా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న అమెరికా సంకల్పం మరింత బలపడిందంటూ సంఘీభావ ప్రకటన చేశారు. తమకు చిరకాలంగా మద్దతుగా నిలుస్తున్నందుకు పెలోసీకి వెన్‌ కృతజ్ఞతలు తెలిపారు.
తైవాన్‌ అధ్యక్షురాలు సై ఇంగ్‌ వెన్‌తో పెలోసీ(ఎడమ)

తైవాన్‌ చుట్టూరా సైనిక విన్యాసాలు
పెలోసీ పర్యటనకు సమాధానంగా తైవాన్‌ను లక్ష్యంగా చేసుకుని మంగళవారం రాత్రి తెరతీసిన భారీ సైనిక విన్యాసాలను చైనా మరింత తీవ్రతరం చేసింది. తైవాన్‌ జలసంధిలోకి మరిన్ని యుద్ధ నౌకలను తరలించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలు, విన్యాసాల జోరు పెంచి అమెరికాకు హెచ్చరిక సంకేతాలు పంపింది. చైనా ఫైటర్‌ జెట్లు తైవాన్‌ గగనతలం సమీపంలో విన్యాసాలకు దిగాయి.

గురువారం నుంచి నాలుగు రోజుల పాటు తైవాన్‌ ద్వీపం చుట్టూ మరిన్ని సైనిక విన్యాసాలుంటాయని చైనా అధికార వార్తా సంస్థ జిన్‌హువా ప్రకటించింది. ఇవి యుద్ధానికి దిగడంతో సమానమని పరిశీలకులంటున్నారు. బలప్రయోగంతోనైనా తైవాన్‌ను తనలో కలిపేసుకునే చర్యలకు చైనా దిగనుందనేందుకు ఇవి సంకేతాలేనంటున్నారు. చైనా చర్యలను తైవాన్‌ తీవ్రంగా నిరసించింది. ‘‘మేం జడిసేది లేదు. సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకుని తీరతాం’’ అని తైవాన్‌ అధ్యక్షురాలు ఇంగ్‌ వెన్‌ అన్నారు.  

మరిన్ని వార్తలు