హిజాబ్‌ వేస్కోను.. మహిళా జర్నలిస్ట్‌ ముక్కుసూటి బదులుతో ఇరాన్‌ అధ్యక్షుడు వెనక్కి!

23 Sep, 2022 07:56 IST|Sakshi

న్యూయార్క్‌: ఇరాన్‌లో హిజాబ్‌ హీట్‌ కొనసాగుతున్నవేళ.. మరో ‘అంతర్జాతీయ’ పరిణామం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాత్రికేయ దిగ్గజం క్రిస్టియానే అమన్‌పౌర్(64)‌.. ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసికి ఝలక్‌ ఇచ్చారు. సీఎన్‌ఎన్‌ ఛానెల్‌ తరపున ఆమె, ఆయన్ని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. అయితే.. హిజాబ్‌ ధరించాలన్న షరతుకు ఆమె అంగీకరించకపోవడంతో.. ఇంటర్వ్యూ ఇవ్వకుండానే వెనుదిరిగారు అధ్యక్షుడు రైసి. 

అమన్‌పౌర్‌ పుట్టింది లండన్‌లోనే అయినా ఆమె తండ్రి మొహమ్మద్‌ తఘీ ఇరాన్‌వాసి. పైగా పదకొండేళ్లవరకు అమన్‌, టెహ్రాన్‌లోనే పెరిగారు. ప్రస్తుతం CNN‍కు చీఫ్‌ ఇంటర్నేషనల్‌ యాంకర్‌గా పని చేస్తున్నారామె. ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ప్రసంగించేందుకు ఇరాన్‌ అధ్యక్షుడు రైసి న్యూయార్క్‌కు వెళ్లారు. ఈ క్రమంలో.. అమన్‌పౌర్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆయన అంగీకరించారు. అయితే.. 

ఇంటర్వ్యూకు ఏర్పాట్లు జరుగుతున్న టైంలో అధ్యక్షుడు రైసి సిబ్బంది వచ్చి.. హిజాబ్‌ ధరించాలంటూ అమన్‌పౌర్‌కు సూచించారు. ‘‘గతంలో ఏ ఇరాన్‌ అధ్యక్షుడు.. విదేశాల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇలాంటి షరతు విధించడం చూడలేదు. కాబట్టి, నేను అంగీకరించను’’ అని ఆమె తేల్చి చెప్పింది. అయితే ఇరాన్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా(హిజాబ్‌ వ్యతిరేక నిరసనలు)ధరించాలని, కనీసం తలను కప్పేస్తూ ఏదైనా గుడ్డ చుట్టుకోవాలని రైసీ అనుచరుడొకరు ఆమెకు సూచించాడు. అయినప్పటికీ ఆమె ససేమీరా అనడంతో సిబ్బంది వెనుదిరిగారు. కాసేపటికే.. ఇంటర్వ్యూ ఇవ్వకుండానే అధ్యక్షుడు రైసి వెళ్లిపోయినట్లు తెలిసింది. 

దీంతో ఆమె ట్విటర్‌లో తన నిరసన వ్యక్తం చేశారు. తన ఎదురుగా ఖాళీ చెయిర్‌ను చూపిస్తూ.. ఇంటర్వ్యూ తాలుకా సెట్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె అందులో వివరిస్తూ.. అధ్యక్షుడు రైసి తీరును తప్పుబట్టారు. 

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఈ నెల మొదటి వారంలో 22 ఏళ్ల వయసున్న మహ్‌సా అమిని హిజాబ్‌ అనే యువతిని హిజాబ్‌ ధరించలేదంటూ పోలీసులు అరెస్ట్‌ చేయగా.. కస్టడీలోనే ఆమె కన్నుమూయడంతో ఇరాన్‌ అంతటా నిరసన జ్వాలలు గుప్పుమన్నాయి. మహిళలు జుట్టు కత్తిరించి.. హిజాబ్‌లు తగలబెట్టి తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఇక ఇరాన్‌ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలతో 31 మంది మృతి చెందినట్లు అనధికార సమాచారం. ఇక ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి.. హిజాబ్ వ్యతిరేక నిరసనలను ‘గందరగోళ చర్య’గా అభివర్ణిస్తున్నారు. స్వేచ్ఛా హక్కు ఇరాన్‌లోనూ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం చోటు చేసుకున్న అల్లర్లను మాత్రం అంగీకరించబోమని ఆయన అంటున్నారు.

ఇదీ చదవండి: హూ ఈజ్‌ హుస్సేన్‌?.. గిన్నిస్‌ రికార్డు

మరిన్ని వార్తలు