కళ్ల ముందే తల్లిప్రాణం పోయింది.. అమెజాన్‌ అడవుల్లో పాపం పసివాళ్లు

30 May, 2023 09:58 IST|Sakshi

దట్టమైన అమెజాన్‌ అడవులు. నెల రోజులుగా అలుపెరగకుండా ముందుకు సాగుతున్న సైన్యం. పాపం.. ఆ నలుగురు పసివాళ్లు ఇంకా  బతికే ఉంటారనే ఆశ వాళ్లను అలా ముందుకు పోనిస్తోంది. సజీవంగా  ఆ చిన్నారులు ఇంటికి చేరాలని కోట్లాది మంది ప్రార్థిస్తున్నారు ఇప్పుడు.

కొలంబియా అమెజాన్‌ అడవుల్లో నెల కిందట తేలికపాటి విమాన ఒకటి ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. అయితే.. అందులో ప్రయాణించిన నలుగురు చిన్నారులకు సంబంధించిన ఆనవాళ్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ ప్రమాదం నుంచి నలుగురు చిన్నారులు బయటపడి ఉంటారని, అడవుల్లోనే ఎక్కడో ఒక దగ్గర సురక్షితంగా తలదాచుకుని ఉండిఉంచొచ్చని కొలంబియా సైన్యం భావిస్తోంది. ఆ ఆశతోనే భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. 

శాటిలైట్‌ చిత్రాల్లో.. పిల్లలు విమాన శకలాల నుంచి నడుచుకుంటూ వెళ్లిన కాలిముద్రలు, అలాగే వాళ్ల కోసం గాలిస్తున్న బృందానికి వాళ్లకు సంబంధించిన వస్తువులు, అడవుల్లో తాత్కాలిక ఆశ్రయం కోసం చేసుకున్న ఏర్పాట్లు, సగం తినిపడేసిన పండ్లు.. కిందటి వారం ఒక జత బూట్లు, డైపర్‌.. ఇలా ముందుకు వెళ్లే కొద్దీ పిల్లల ఆనవాళ్లకు సంబంధించిన వస్తువులు దొరుకుతుండడంతో వాళ్లు బతికే ఉంటారన్న ఆశలతో గాలింపును ఉధృతం చేశారు. 

👉 దొరికిన ఆధారాలతో వాళ్లు సజీవంగానే ఉన్నారని భావిస్తున్నాం. వాళ్లకు కనిపెట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు అంటూ ఈ రెస్క్యూ ఆపరేషన్‌ బృందానికి నేతృత్వం వహిస్తున్న జనరల్‌ పెడ్రో చెబుతున్నారు. ఒకవేళ వాళ్లు చనిపోయి ఉంటే స్నిఫ్ఫర్‌ డాగ్స్‌ సాయంతో ఈపాటికే ఆ మృతదేహాలను కనిపెట్టేవాళ్లం. కానీ, అలా జరగలేదు కాబ్టటి వాళ్లు బతికే ఉంటారని మేం భావిస్తున్నాం అని ఆయన చెబుతున్నారు. 

👉 ఏం జరిగిందంటే..

మే 1 ఉదయం, సెస్నా 206 తేలికపాటి ప్యాసింజర్‌ విమానం.. అరరాకువారా అని పిలువబడే అడవి ప్రాంతం నుండి కొలంబియా అమెజాన్‌లోని శాన్ జోస్ డెల్ గువియారే పట్టణానికి బయలుదేరింది. ఈ మధ్య దూరం 350 కిలోమీటర్లు. అయితే ఆ ఎయిర్‌ప్లేన్‌ బయల్దేరిన కాసేపటికే ఇంజిన్‌లో సమస్య ఉందంటూ పైలట్‌ రిపోర్ట్ చేశాడు. కాసేపటికే విమానం సిగ్నల్‌ రాడార్‌కు అందకుండా పోయింది. దీంతో విమానం ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. 

👉 ఆపై అది ప్రమాదానికి గురైందని ధృవీకరించుకుని.. శకలాల కోసం గాలింపు చేపట్టారు. మే 15, 16వ తేదీల్లో.. దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలను సైన్యం కనిపెట్టంది. ఆ పక్కనే చెట్ల పొదట్లో విమాన శకలాలు చిక్కుకుని కనిపించాయి. అయితే.. లెస్లీ(13), సోలెయినీ(9), టెయిన్‌ నోరెయిల్‌(4), మరో పసికందు క్రిస్టిన్‌ కనిపించకుండా పోయారు.

👉 దీంతో 200 మంది సైనికులు, కొందరు అడవుల్లో నివసించే స్థానికుల సాయంతో సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. మధ్యలో వాళ్లకు సంబంధించిన వస్తువులు కనిపిస్తుండడంతో.. బతికే ఉంటారని భావిస్తున్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్‌ల ద్వారా ఆ అడవుల్లో నీళ్ల బాటిళ్లు, ఆహార పొట్లాలు పడేస్తున్నారు. 

👉 విమాన ప్రమాదంలో ఆ చిన్నారుల తల్లి మాగ్దలేనా కూడా మరణించింది. పైలట్‌తో పాటు ఓ తెగ నాయకుడు కన్నుమూశాడు. అయితే.. పిల్లలకు సంబంధించిన జాడ మాత్రం దొరకలేదు. వాషింగ్టన్‌కు రెండింతల పరిమాణంలో ఉండే ఆ అటవీ ప్రాంతంలో చిన్నారు ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు భీకరమైన,దుర్భేద్యమైన అటవీ ప్రాంతంలో కావడంతో సెర్చ్‌ ఆపరేషన్‌కు అవాంతరాలు ఏర్పడుతున్నాయి.

దీంతో.. రోజులు గడిచే కొద్దీ ఆందోళన పెరిగిపోతోంది. అడవి మార్గంలో ఈ నేపథ్యంలో  ఆదివారం నుంచి ఆ ప్రయత్నాలు తీవ్రతరం అయ్యాయి. మూడు కిలోమీటర్లపాటు ఫోకస్‌ పడేలా సెర్చ్‌లైట్లను అడవుల్లో ఏర్పాటు చేసింది సైన్యం. తద్వారా పిల్లలు తమవైపు వస్తారనే ఆశతో ఉంది.  

ఆ నమ్మకమే బతికిస్తోంది.. 
కనిపించకుండా పోయిన నలుగురు చిన్నారులు.. హుయిటోటో(విటోటో) కమ్యూనిటీకి చెందిన వాళ్లు. అడవితో మమేకమై జీవించడం ఆ తెగకు అలవాటే. చిన్నప్పటి నుంచి చేపల వేట, ఆహార పదార్థాల సేకరణ లాంటి పనుల్లో శిక్షణ తీసుకుంటారు. కాబట్టి, ఏదో రకంగా వాళ్లు బతికేందుకు ప్రయత్నిస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఆ చిన్నారుల తాత. లెస్లీ తన కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందేమోనని అంటున్నాడాయన. అయితే.. క్రూర వన్యప్రాణులతో పాటు డ్రగ్స్‌ సరఫరా చేసే ముఠాలకు నెలవు ఆ ప్రాంతం. అలాంటి ముప్పును వాళ్లు ఎలా ఎదుర్కొంటారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారాయన.

మరిన్ని వార్తలు