వాంటెడ్‌ క్రిమినల్‌గా ‘మార్క్‌ జుకర్‌బర్గ్‌’.. పట్టిస్తే రూ.22కోట్లు

30 Jun, 2021 13:25 IST|Sakshi

ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ పోలికలతో ఉన్న వ్యక్తి కోసం గాలింపు

ఫేస్‌బుక్‌లో వైరలవుతోన్న కొలంబియా పోలీసుల ప్రకటన

బొగోటా: లోకంలో మనుషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఏడుగురి సంగతి ఏమో కానీ అప్పుడప్పుడు మనుషుల్ని పోలిన మనుషులు అక్కడక్కడ ఎదరుపడతారు. వారు మంచి వారైతే పర్లేదు.. కానీ నేరస్తులు, పోలీసులు హిట్‌ లిస్ట్‌లో ఉన్నవారైతేనే ఇబ్బంది. తాజాగా ఫేస్‌బుక్‌ ఫౌండర్‌, అమెరికన్‌ మీడియా మాగ్నేట్‌ అయిన మార్క్‌ జుకర్‌బర్గ్‌కి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఆయన పోలికలతో ఉన్న ఓ నేరస్తుడి కోసం కొలంబియా పోలీసులు గాలిస్తున్నారు. అతడిని పట్టిస్తే 3 మిలియన్‌ డాలర్లు(రూ.22,30,23,000) బహుమతి ఇస్తామని ప్రకటించారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫేస్‌బుక్‌లోనే ఈ ప్రకటన చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. 

గతవారం కొలంబియా అధ్యక్షుడు ఇవాన్‌ డ్యూక్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ సమయంలో హెలికాప్టర్‌లో కొలంబియా అధ్యక్షుడు డ్యూక్‌తో పాటు రక్షణ మంత్రి డియెగో మొలానో, అంతర్గత మంత్రి డేనియల్ పలాసియోస్, నార్టే డి శాంటాండర్ సిల్వానో సెరానోతో సహా కొందరు అధికారులున్నారు. అదృష్టం కొద్ది ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటన దర్యాప్తులో భాగంగా కొలంబియా పోలీసులు నిందుతుల స్కె​చ్‌ గీయించారు. వీరిలో ఒక వ్యక్తి అచ్చం ఫేస్‌బుక్‌ ఫౌండర్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌లానే ఉన్నాడు. 

కొలంబియా పోలీసులు నిందుతుల ఊహాచిత్రాలను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేస్తూ.. ‘‘ఈ ఫోటోలో ఉన్నవారిని పట్టుకోవడంలో మాకు సాయం చేయండి. మిస్టర్ ప్రెసిడెంట్ ఇవాన్ డ్యూక్, అతని పరివారం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై దాడి చేసిన నేరస్థుల చిత్రాలు ఇవి. వీరిని పట్టించినవారికి 3మిలియన్‌ డాలర్ల బహుమతి అందిస్తాం. వీరి గురించి సమాచారం తెలిసినవారు ఈ నంబర్లకు 3213945367 లేదా 3143587212 కాల్‌ చేయండి’’ అని మెసేజ్‌ చేశారు. ఈ ఫోటోలో ఓ వ్యక్తి అచ్చు మార్క్‌ జుకర్‌బర్గ్‌లా ఉండటంతో అది అందరిని దృష్టిని ఆకర్షించింది. ఇది చూసిన నెటినులు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. ‘‘కొంపతీసి జుకర్‌బర్గ్‌ని అరెస్ట్‌ చేస్తారా ఏంటి’’.. ‘‘ఒకవేళ నిందితుడు దొరికినా నేను జుకర్‌బర్గ్‌ని అంటే ఏంటి పరిస్థితి’’ అంటూ నెటిజనులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించబోతోందెవరు..?

మరిన్ని వార్తలు