సెల్ఫీ స్టార్‌ గొరిల్లా: అప్పుడు నవ్వులు.. ఇప్పుడు కన్నీళ్లు

7 Oct, 2021 07:35 IST|Sakshi

Ndakasi Selfie Pose Gorilla No More: ఫేస్‌బుక్‌ మీద ఆరోపణల తర్వాత సోషల్‌ మీడియా మనుషుల మీద మానసికంగా ప్రభావం చూపెడతాయా? లేదా? అనేది ప్రస్తుతం చర్చలో నడుస్తోంది. ఇలాంటి తరుణంలో ఓ ఘటన ఇంటర్నెట్‌లో యూజర్లను భావోద్వేగాల్ని ప్రదర్శించేలా చేస్తోంది. కొన్నేళ్ల క్రితం మనిషితో సెల్ఫీకి ఫోజులిచ్చిన ఓ గొరిల్లా.. చివరికి తనను కాపాడిన వ్యక్తి ఒడిలోనే తుదిశ్వాస విడిచి అందరితో కంటతడి పెట్టిస్తోంది. 


సెల్ఫీ స్టార్‌ ఎండకశి..  కొండ జాతికి చెందిన గొరిల్లా ఇది (Mountain Gorilla).  2019లో తన తోటి గొరిల్లా ఎన్‌డెజెతో కలిసి పార్క్‌ రేంజర్‌ మాథ్యూ షమావూ తీసిన సెల్ఫీకి సీరియస్‌ ఫోజు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ గొరిల్లా వరల్డ్‌ ఫేమస్‌ అయ్యింది. ఎండకశి మీద మీమ్స్‌, కథనాలు ఎన్నో వచ్చాయి. కొన్ని డాక్యుసిరీస్‌లలోనూ కనిపించింది. చివరికి పద్నాలుగేళ్ల వయసులో.. దాని చిన్నప్పటి నుంచి సంరక్షిస్తున్న ఆండ్రే బౌమా కౌగిలిలోనే కన్నుమూసింది అది.

A post shared by Virunga National Park (@virunganationalpark)

సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి విపరీతంగా వైరల్‌ అవుతోంది. అనారోగ్య సమస్యలతోనే ఎండకశి చనిపోయినట్లు పార్క్‌ నిర్వాహకులు తెలిపారు. చిన్నపిల్లలా చూసుకున్నా. కానీ, వీడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు అంటూ ఆండ్రే పేరిట ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.


కాంగో విరుంగ నేషనల్‌ పార్క్‌లో సెన్‌వెక్వే సెంటర్‌లో ఇంతకాలం పెరిగింది ఎండకశి. విశేషం ఏంటంటే.. ఈ సెంటర్‌లో పెరిగే గొరిల్లాలన్నీ దాదాపు అనాథలే!. విరుంగ నేషనల్‌ పార్క్‌లో నివసించే గొరిల్లాలను, సాయుధులైన మిలిటెంట్లు కాల్చి చంపుతూ వస్తున్నారు.  ఈ క్రమంలో 2007లో ఎండకశి తల్లిని సైతం కాల్చి చంపారు. ఆ టైంలో తల్లి శవం మీద గట్టిగా పడుకున్న నెలల వయసున్న పిల్ల గొరిల్లా(ఎండకశి)ని పార్క్‌ రేంజర్‌ ఆండ్రే బౌమా కాపాడి.. ఇంతకాలం ఆలనా పాలనా చూసుకున్నాడు. ఇక  ఈ ఘటన తర్వాత కొండ గొరిల్లాలను సంరక్షించేందుకు కాంగో భారీ ఆపరేషన్‌ నిర్వహించింది. ఇది సత్ఫలితం ఇవ్వగా..  2007లో 720 కొండ గొరిల్లాల సంఖ్య.. ఇప్పుడు ఆ సంఖ్య 1,063కి చేరిందని తెలుస్తోంది.

చదవండి: ఆకలేస్తుందన్నాడు.. సాయం చేస్తే.. చివర్లో ట్విస్ట్‌ ఇచ్చాడు

మరిన్ని వార్తలు