శ్వేతసౌధం వీడనున్న వేళ ‍ట్రంప్‌కు పరాభవం

2 Jan, 2021 11:02 IST|Sakshi

వాషింగ్టన్‌: అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ముందు రిపబ్లికన్‌ డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఘోర పరాభవం ఎదురైంది. రక్షణ రంగానికి సంబంధించిన కీలక బిల్లుపై వీటో(తిరస్కరణ) అధికారాన్ని ప్రయోగించిన ఆయనకు సెనేట్‌ గట్టి షాకిచ్చింది. ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 81-13 ఓట్ల తేడాతో వీటోను తిరగరాస్తూ బిల్లుకు ఆమోదం తెలిపింది. కాగా అమెరికా సైనికులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు ఉద్దేశించిన 740.5 బిలియన్‌ డాలర్ల డిఫెన్స్‌ పాలసీ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, డిసెంబరు 23న ట్రంప్‌ ఈ బిల్లును తిరస్కరించారు. ఈ క్రమంలో అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా డెమొక్రాట్ల ఆధిపత్యం గల ప్రతినిధుల సభ సోమవారం బిల్లును ఆమోదించగా.. రిపబ్లికన్లు మెజారిటీగా ఉన్న సెనేట్‌ శుక్రవారం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక కాంగ్రెస్‌ ఆమోదంతో రక్షణ విధాన బిల్లు చట్టరూపం దాల్చనుంది. (చదవండి: అమెరికా బలగాలపై దాడికి చైనా సాయం?)

కాగా 2016లో అధ్యక్ష పీఠం చేపట్టిన నాటి నుంచి ట్రంప్‌నకు గతంలో ఇలాంటి అనుభవం ఎన్నడూ ఎదురుకాలేదు. పదవి నుంచి తప్పుకొనే సమయం ఆసన్నమైన నేపథ్యంలో ఆయనకు ఈ విధంగా ఊహించని షాక్‌ తగిలింది. ఇక ఈ విషయంపై స్పందించిన ట్రంప్‌.. రిపబ్లికన్ల ఆధిపత్యం కలిగిన తెలివైన నిర్ణయం తీసుకోలేక పోయిందని తనదైన శైలిలో విమర్శించారు. టెక్నాలజీ కంపెనీలకు అపరిమిత అధికారాన్ని కట్టబెట్టే సెక్షన్‌ 230 నుంచి విముక్తి పొందే అవకాశాన్ని కోల్పోయేలా చేసిందని మండిపడ్డారు. ఇది నిజంగా విషాదకరమైన విషయమని పేర్కొన్నారు. కాగా డిఫెన్స్‌ పాలసీ బిల్లు ద్వారా భారీగా ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకే గాక, అమెరికా బలగాలకు హజార్డస్‌ డ్యూటీ పే కింద నెలకు చెల్లించే మొత్తాన్ని 250 డాలర్ల నుంచి 275 డాలర్లకు పెంచేందుకు నిధులు చేకూరనున్నాయి. (చదవండి: అమెరికన్లను శోకంలో ముంచకండి: ఇరాన్‌)

మరిన్ని వార్తలు