అమెరికాలో భారీ అల్లర్లకు కుట్ర ?

13 Jan, 2021 04:37 IST|Sakshi
క్యాపిటల్‌ భవనం వద్ద భద్రతా దళాలు

50 రాష్ట్రాల్లోనూ క్యాపిటల్‌ భవనాలపై గురి  

హెచ్చరించిన ఎఫ్‌బీఐ

వాషింగ్టన్‌లో 24 వరకు ఎమర్జెన్సీ 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు 50 రాష్ట్రాల్లోనూ చట్టసభల దగ్గర  పెద్ద ఎత్తున అల్లర్లు, సాయుధ నిరసనలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తమకు సమాచారం అందిందని ఎఫ్‌బీఐ హెచ్చరించింది. కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సమయం దగ్గరకొస్తున్న నేపథ్యంలో ట్రంప్‌ అనుచరులు  మరోసారి హింసాకాండకు పాల్పడే అవకాశాలున్నాయన్న భయాందోళనలు రేగుతున్నాయి. ట్రంప్‌ని గడువుకు ముందే పదవీచ్యుతుడ్ని చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అనుచరులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జనవరి 16 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల క్యాపిటల్స్‌ వద్ద నిరసనలకు దిగడానికి వ్యూహరచన చేశారు.  ఇక జనవరి 20న బైడెన్‌ ప్రమాణస్వీకార మహోత్సవం నాడు వాషింగ్టన్‌లో భారీ ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఎఫ్‌బీఐ కార్యాలయ అంతర్గత సందేశాల్లో పేర్కొన్నట్టుగా అమెరికా మీడియా వెల్లడించింది. మరోవైపు  ఎలాంటి అవాంఛనీయ çఘటనలు చోటు చేసుకోకుండా అదనపు జాతీయ భద్రతా బలగాలను మోహరించారు.  

వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ
జో బైడెన్‌ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాజధాని వాషింగ్టన్‌లో అత్యవసర పరిస్థితి విధించారు. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఎమర్జెన్సీ జనవరి 24వరకు కొనసాగుతుందని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎమర్జెన్సీ సమయంలో స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌), ఫెడరల్‌ ఎమెర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ (ఫెమా) సహాయ చర్యల్లో నిమగ్నమై ఉంటాయి. ప్రజల ప్రాణాలకు, ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి ముప్పు రాకుండా జాతీయ భద్రతా బలగాలు రంగంలోకి దింపుతారు. 

విదేశాంగ వెబ్‌సైట్‌ కలకలం
అమెరికా విదేశాంగ వెబ్‌సైట్‌లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదవీకాలం జనవరి 11 రాత్రి 7:49తో ముగిసిందని పేర్కొనడం కలకలాన్ని సృష్టించింది. అధ్యక్షుడుతో పాటు ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ పదవీ కాలం కూడా ముగిసిపోయినట్టుగా వారిద్దరి బయోగ్రఫీలలో పేర్కొన్నారు. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక విదేశాంగ శాఖ అధికారులు తలలు పట్టుకున్నారు. దీనిపై విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపో అంతర్గత విచారణకు ఆదేశించారు. 

చేతులు కలిపిన ట్రంప్, పెన్స్‌ 
అమెరికా క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ల మధ్య మళ్లీ మాటలు కలిశాయి. సోమవారం సాయంత్రం వారిద్దరూ వైట్‌హౌస్‌ అధ్యక్ష కార్యాల యంలో కలిసి కూర్చొని మాట్లాడారు. వారిద్దరి సంభాషణ ఆహ్లాదకర వాతావ రణం సాగినట్టుగా వైట్‌హౌస్‌ అధికారులు వెల్లడించారు. పదవీకాలం ముగిసేవరకు కలసి పని చేయాలని వారిద్దరూ అవగాహనకి వచ్చి నట్టు తెలిపారు. దీంతో ఇక ఆర్టికల్‌ 25 సవరణ ద్వారా ట్రంప్‌ని గద్దె దింపే అవకాశం లేదన్న విశ్లేషణలు వినపడు తున్నాయి.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు