Myanmar: మా పౌరులు మరణిస్తున్నారు..దయచేసి స్పందించండి

17 May, 2021 12:19 IST|Sakshi

యాంగాన్‌: మయన్మార్‌లో సైన్యం అక్కడి ప్రజాస్వామిక ప్రభుత్వంపై ఫిబ్రవరిలో తిరుగుబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఆంగ్ సాన్ సూచీతో పాటు పలువురు నేతలను నిర్బంధంలోకి తీసుకొని సైనిక పాలన ప్రకటించింది. సూచీపై పలు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టించింది. నాటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మయన్మార్‌లో జరుగుతున్న పరిణామాలపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాయుధ బలగాల దినోత్సవం రోజే మయన్మార్ సైన్యం రెచ్చిపోయింది. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై తూటాల వర్షం కురిపించింది. రక్తపాతం సృష్టించింది. మయన్మార్ చరిత్రలోనే ఇది చీకటి రోజని ప్రజాస్వామ్య అనుకూలవాదులు, మానవతావాదులు పేర్కొన్నారు. మయన్మార్‌లోని ప్రముఖులు, నటులు, సోషల్‌ మీడియాను ప్రభావితం చేసేవారు, కీడాకారులు సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలిపారు. 

తాజాగా మయన్మార్ మిస్ యూనివర్స్ పోటీదారు తుజార్ వింట్ ఎల్విన్ ఆదివారం పోటీలో మాట్లాడుతూ.. మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా స్పందించాలని ప్రపంచ దేశాలను కోరారు.  "మయన్మార్‌లో జరిగే హింస గురించి మాట్లాడాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. సైన్యం తిరుగుబాటు చేసినప్పటి నుంచి దీనిపై స్పందిస్తున్నాను. మా ప్రజలు ప్రతిరోజూ మిలిటరీ దళాల కాల్పుల్లో చనిపోతున్నారు" అంటూ ఆమె బావోద్వేగానికి గురయ్యారు. ఫ్లోరిడాలోని హాలీవుడ్‌లోని సెమినోల్ హార్డ్ రాక్ హోటల్ & క్యాసినోలో జరిగిన ఫైనల్స్‌లో ఆమె కనిపించారు.

కాగా తుజార్ వింట్ ఎల్విన్ మిస్ యూనివర్స్ పోటీ చివరి రౌండ్లో పాల్గొనలేదు. కానీ ఆమె ధరించిన ఆ దేశ జాతీయ దుస్తులకు గాను "బెస్ట్‌ నేషనల్‌ అవార్డ్‌"ను గెలుచుకుంది. ఆమె ఆ దుస్తులతో కవాతు చేస్తూ "మయన్మార్ కోసం ప్రార్థించండి" అనే ఒక ప్లకార్డ్‌ ప్రదర్శించారు. ఇక ఇప్పటివరకు 790 మంది భద్రతా దళాల కాల్లుల్లో మరణించగా.. 5,000 మందిని అరెస్టు చేసినట్లు, 4,000 మంది ప్రముఖులను అదుపులోకి తీసుకున్నట్లు అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ఖైదీల కార్యకర్త బృందం తెలిపింది.

(చదవండి: Myanmar Beauty Queen: దేశమాత స్వేచ్ఛ కోరి)

మరిన్ని వార్తలు