COP 27: కాప్‌ 27లో కాక!

20 Nov, 2022 05:01 IST|Sakshi

కీలకాంశాలపై ఏకాభిప్రాయం మృగ్యం

ఇంధన లాబీ కనుసన్నల్లో సదస్సు

వర్ధమాన దేశాల తీవ్ర ఆరోపణలు

పర్యావరణ లక్ష్యాలపై పట్టింపేది?

ఈజిప్టు సంప్రదింపుల పత్రంపై యూరప్‌ దేశాల అభ్యంతరం

‘పరిహార నిధి’కి పెద్ద దేశాలు ఓకే!

షెర్మెల్‌ షేక్‌ (ఈజిప్ట్‌): ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కాప్‌ 27 దేశాల మధ్య ఉద్రిక్తతలకు వేదికగా మారింది. విషయం వాడివేడి చర్చల స్థాయిని దాటి ఏకంగా గొడవల దాకా వెళ్లింది. పలు కీలకాంశాలపై ఏకాభిప్రాయం మృగ్యమైంది. దాంతో శుక్రవారం ముగియాల్సిన ఈ 12 రోజుల సదస్సు శనివారమూ కొనసాగింది. అయినా పలు విషయాలపై పీటముడి కొనసాగుతూనే ఉంది.

ముఖ్యంగా ఆతిథ్య దేశం ఈజిప్ట్‌ రూపొందించిన సంప్రదింపుల పత్రం పూర్తిగా నిస్సారమంటూ చాలా దేశాలు పెదవి విరిచాయి. అందులోని పలు అంశాలపై తీవ్ర అసంతృప్తి, అభ్యంతరాలు వెలిబుచ్చాయి. ఇలాగైతే గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేనంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘1.5 డిగ్రీల లక్ష్యం’తో పాటు యూరోపియన్‌ యూనియన్‌ తాజాగా చేసిన చాలా ప్రతిపాదనలను సదరు పత్రంలో బుట్టదాఖలు చేయడంపై యూరప్‌ దేశాలు గుర్రుగా ఉన్నాయి.

ఒక దశలో అవి వాకౌట్‌ చేస్తామని ముక్త కంఠంతో హెచ్చరించే దాకా వెళ్లింది! ఇలాగైతే పత్రంపై యూరప్‌ దేశాలేవీ సంతకం చేయబోవని ఈయూ కుండబద్దలు కొట్టింది. వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరిగిపోతే భారీగా ముంపు తదితర ముప్పును ఎదుర్కోవాల్సి వచ్చే ద్వీప దేశాల భద్రతను పత్రంలో అసలే పట్టించుకోలేదన్నది మరో అభ్యంతరం. మరోవైపు ఈజిప్ట్‌ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించమే గాక ఆయా దేశాలపై ప్రత్యారోపణలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో సదస్సుకు హాజరైన 40 వేల పై చిలుకు ప్రతినిధుల్లో చాలామంది వెనుదిరుగుతుండటంతో ప్రాంగణమంతా బోసిపోయి కన్పిస్తోంది.

మరోవైపు, విచ్చలవిడి పోకడలతో పర్యావరణ విపత్తులకు ప్రధాన కారకులైన సంపన్న దేశాలు వాటివల్ల తీవ్రంగా నష్టపోయిన పేద, వర్ధమాన దేశాలను ఆదుకునేందుకు భారీ పరిహార నిధి ఏర్పాటు చేయాలంటూ భారత్‌ సహా పలు దేశాలు చేసిన డిమాండ్‌పైనా చివరిదాకా ప్రతిష్టంభనే కొనసాగింది. ఎట్టకేలకు నిధి ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడినట్టు మధ్యవర్తులు శనివారం సాయంత్రం ప్రకటించారు.

అయితే దానిపైనా ఏకాభిప్రాయం ఇంకా కుదరాల్సే ఉంది! ఇందుకోసం ఏటా ఏకంగా 100 బిలియన్‌ డాలర్లు వెచ్చస్తామంటూ 2009లో చేసిన వాగ్దానాన్ని సంపన్న దేశాలు ఇప్పటికీ నిలుపుకోకపోవడం గమనార్హం. మరోవైపు, ‘‘శిలాజ ఇంధనాల వాడకాన్ని వీలైనంత త్వరలో పూర్తిగా నిలిపేయాలన్నది గత సదస్సులోనే చేసిన ఏకగ్రీవ తీర్మానం. కానీ ఇప్పటికీ వాటి వాడకం పెరిగిపోతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. నిజానికి శిలాజ ఇంధన పరిశ్రమే సదస్సులో ప్రతి చర్చాంశాన్నీ తన కనుసన్నల్లో నియంత్రిస్తోంది’’ అంటూ వర్ధమాన దేశాలు ఆరోపణలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

మరిన్ని వార్తలు