వీడియో: కాప్‌27 సదస్సులో హైడ్రామా.. వేదికను వీడిన బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌

8 Nov, 2022 09:07 IST|Sakshi

షెర్మ్‌–ఎల్‌–షేక్‌: ప్రపంచ పర్యావరణ సదస్సు కాప్‌-27 కు హాజరుకాబోనని ప్రకటించి.. ఆవెంటనే యూటర్న్‌తీసుకుని ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు బ్రిటన్‌ కొత్త ప్రధాని రిషి సునాక్‌. ఆదివారం రాత్రే సదస్సుకు చేరుకున్న ఆయన.. పర్యావరణ మార్పులు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించబోయే సాయం, భావితరాల సంక్షేమం గురించి కూడా ప్రసంగించారు. అయితే ఓ కీలక సమావేశం జరుగుతున్న సమయంలో హడావిడిగా అక్కడి నుంచి నిష్క్రమించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. 

కాప్‌27 సదస్సులో సోమవారం ఓ నాటకీయ పరిణామం జరిగింది. సదస్సు కొనసాగుతున్న సమయంలోనే ఆయన ఆ హాల్‌ నుంచి హడావిడిగా బయటకు వెళ్లిపోయారు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక గందరగోళానికి గురయ్యారు అక్కడ ఉన్నవాళ్లంతా. 

COP27 సదస్సులో భాగంగా.. ఫారెస్ట్‌స్‌ పార్ట్‌నర్‌షిప్‌ ప్రారంభం అయిన కాసేపటికే ఓ సహాయకుడు వచ్చి బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ నిమిషంపాటు చెవిలో ఏదో చెప్పాడు. అయినా సునాక్‌ అలాగే స్టేజ్‌ మీద కూర్చుని ఉండిపోయారు. ఈ లోపే మరో వ్యక్తి వచ్చి ఆయనతో ఏదో చెప్పగా.. హడావిడిగా సునాక్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని యూకేకు చెందిన ఓ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు లియో హిక్‌మ్యాన్‌ తెలిపారు. 

సహాయకులు ఏం చెప్పారు? ఆయన ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోయారు? ఆయనింకా అక్కడే ఉన్నారా? బ్రిటన్‌కు వెళ్లారా? దానిపై డౌనింగ్‌ స్ట్రీట్‌ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. 

ఐరాస నిర్వహించే పర్యావరణ మార్పుల సదస్సును ‘కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ది పార్టీస్‌’(COP27)గా వ్యవహరిస్తుంటారు. ఈజిప్ట్‌లో రిసార్టుల వనంగా పేరున్న షెర్మ్‌–ఎల్‌–షేక్‌లో ఈ సదస్సు ఆదివారం నుంచి మొదలైంది. ఇదిలాఉంటే.. 42 ఏళ్ల రిషి సునాక్‌కు ప్రధాని హోదాలో ఇదే తొలి అధికారిక పర్యటన కావడం గమనార్హం.

ఇదీ చదవండి: రిషి సునాక్‌పై విమర్శల పర్వం!

మరిన్ని వార్తలు