సోడా, చిప్స్‌ కోసం వెళ్లాను.. అంతలోనే ఘోరం..

23 Mar, 2021 15:11 IST|Sakshi

ఓ పోలీసు అధికారి సహా 10 మంది మృతి

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

పోలీసుల అదుపులో నిందితుడు

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సోమవారం కొలరాడోలోని ఓ సూపర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించిన  దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి సహా 10 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరుపుతున్న వ్యక్తిని పట్టుకునే క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ లోపలికి వెళ్లారు.

ఈ క్రమంలో దుండగుడు అతనిపై కూడా కాల్పులు జరపగా, పోలీసు అధికారి అక్కడికక్కడే మరణించారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అర్ధ నగ్నంగా సూపర్‌మార్కెట్‌లోకి ప్రవేశించిన దుండగుడు కాల్పులకు తెగబడినట్టు జరిపినట్లు సమాచారం. ఇక ఈ ఘటనలో ఉన్మాదికి సైతం గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


కాల్పులు జరిగిన సూపర్‌ మార్కెట్‌ ప్రాంతాన్ని భద్రత సిబ్బంది ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. కాల్పుల నుంచి బయటపడ్డ ప్రత్యక్షసాక్షి ఒకరు మాట్లాడుతూ...'సోడా, చిప్స్‌ తీసుకోవడానికి సూపర్‌ మార్కెట్‌కి వెళ్లాను. దుండగుడు 8 రౌండ్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో నేను దాదాపు చనిపోతాననుకున్నా. ఒకరికొకరం సహాయం చేసుకుంటూ సూపర్‌ మార్కెట్‌ బయటకు పరుగెత్తుకొచ్చాం. కానీ దురదృష్టవశాత్తూ కొందరు షాక్‌లోనే ఉండిపోయారు' అని పేర్కొన్నాడు. 


కాల్పుల ఘటనపై కొలరాడో గవర్నర్‌ జారెడ్ పోలిస్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బౌల్టర్‌లో చోటుచేసుకున్న ఘటన తీరని విషాదాన్ని కలిగిస్తుంది. దీనిపై మాట్లాడటానికి మాటలు రావడం లేదు. ఈ ఘటన నన్ను కలిచివేస్తుంది అని ట్వీట్‌ చేశారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు