కరోనా వైరస్‌ కాదు.. బయో వార్‌ అది!: ఉత్తర కొరియా సంచలన ఆరోపణలు

1 Jul, 2022 13:07 IST|Sakshi

ప్యాంగ్‌యాంగ్‌: ప్రపంచమంతా కరోనా వైరస్‌ను సాధారణ పరిస్థితులుగా భావిస్తున్న తరుణంలో.. ఉత్తర కొరియాలో మాత్రం తాజా విజృంభణతో లక్షల మంది వైరస్‌ బారినపడ్డారు. ఈ తరుణంలో వైరస్ వ్యాప్తిపై సంచలన ఆరోపణలకు దిగింది ఆ దేశం. పొరుగుదేశం బయో వార్‌కు ప్రయత్నించిందనేది కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తాజా ఆరోపణ.

పొరుగు దేశం నుంచి అనుమానాస్పద రీతిలోనే వైరస్‌ తమ దేశంలోకి ప్రవేశించిందంటూ దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆరోపణలు గుప్పించింది. సరిహద్దు రేఖ, సరిహద్దుల వెంబడి ఉన్న ప్రాంతాల్లో గాలి, ఇతర వాతావరణ పరిస్థితులు..  గాల్లోంచి ఊడిపడే బెలూన్లు.. ఇతరత్ర వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి అంటూ ఉత్తర కొరియా ప్రజలకు కిమ్‌జోంగ్‌ఉన్‌ ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. 

నార్త్‌ కొరియా మీడియా కేసీఎన్‌ఏ ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌ మధ్యలో కుమ్‌గాంగ్‌ రీజియన్‌లో  18 ఏళ్ల సైనికుడు, ఐదేళ్ల చిన్నారిలో తొలిసారి వైరస్‌ లక్షణాల బారిన పడ్డారు. కొండప్రాంతం నుంచి అనుమానాస్పద కదలికల వల్లే వాళ్లు వైరస్ బారిన పడ్డట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. బెలూన్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి జరిగింది. ఆపై అదే రీజియన్‌లోని ఇఫో-రి ప్రాంతం నుంచి వచ్చిన కొందరి కారణంగా.. ఉత్తర కొరియా మొత్తం వైరస్‌ వ్యాప్తి చెందింది.

దీనంతటికి పొరుగు దేశం కారణమని అత్యున్నత దర్యాప్తులో తేలింది.. వాళ్లు బయో వార్‌ కోసం ప్రయత్నించారు అని ఉత్తర కొరియా ప్రకటించుకుంది. అయితే వైరస్‌ వ్యాప్తిని తమ దేశం సమర్థవంతంగా అడ్డుకుందని ఆ కథనంలో పేర్కొంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. దక్షిణ కొరియా ఈ ఆరోపణలపై స్పందించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు