టీకా తీసుకున్న వారి ద్వారా కూడా కరోనా వ్యాప్తి

30 Oct, 2021 05:57 IST|Sakshi

లండన్‌: కోవిడ్‌–19 వైరస్‌ నుంచి రక్షణ కోసం టీకా రెండు డోసులు తీసుకున్న వారి నుంచి కూడా ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతున్నట్టు లాన్సెట్‌ జర్నల్‌ తాజా నివేదిక వెల్లడించింది. అయితే, వ్యాక్సిన్‌ తీసుకోని వారితో పోలిస్తే టీకా తీసుకున్న వారిలో వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్నట్టు తెలిపింది. యూకేలోని ఇంపీరియల్‌ కాలేజీ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తల అధ్యయనం ఫలితాలను లాన్సెట్‌ వెలువరించింది. ‘‘టీకా రెండు డోసులు తీసుకున్న వారికి కూడా వైరస్‌ సోకుతోంది. అయితే వారు త్వరగానే కోలుకుంటున్నారు. కానీ వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించేవారు వ్యాక్సిన్‌ తీసుకోకపోతే మహమ్మారి వారిని బాగా వేధిస్తోంది’’ అని ఆ నివేదిక వెల్లడించింది.

‘‘కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో వ్యాక్సిన్లే అత్యంత కీలకం. మన చుట్టూ ఉన్నవారు టీకా వేసుకున్నారు, మనకేం కాదులే అన్న ధీమా పనికిరాదు. టీకా వేసుకున్న వారి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది’’ అని అధ్యయనం సహ రచయిత ప్రొఫెసర్‌ అజీ లల్వానీ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతున్నప్పటికీ కరోనా కేసులు పెరిగిపోవడానికి ఇదే కారణమని వివరించారు. టీకా రెండో డోసు తీసుకున్న 3 నెలల తర్వాత నుంచి వారికి వైరస్‌ సోకి ఇతరులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించామన్నారు. 

మరిన్ని వార్తలు