మీ వెంట లక్షల మందిమి ఉన్నాం: వైరల్‌

19 Dec, 2020 18:24 IST|Sakshi
వీడియో దృశ్యాలు

బోస్టన్‌ : కరోనా వైరస్‌పై పోరాటం చేయటంలో ఫ్రంట్‌ లైన్‌ సిబ్బంది శ్రమ వెలకట్టలేనిది. కర్తవ్య నిర్వహణలో భాగంగా కరోనాకు ఎదురొడ్డి నిలబడి ఇన్ని రోజులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతికారు. వ్యాక్సిన్‌ కోసం వేయి కళ్లతో ఎదురు చూశారు. వారి ప్రార్థనలు ఫలించి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా అమెరికాలో ఫైజర్‌, మోడర్నా వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతి లభించింది. వ్యాక్సిన్లను మొదటగా ఫ్రంట్‌ లైన్‌ సిబ్బందికి వేయనున్నారు. దీంతో బోస్టన్‌లోని ఓ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ వైద్య సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. అమెరికన్‌ సింగర్‌ లిజ్జో పాట ‘‘ గుడ్‌ యాజ్‌ హెల్‌‌’’కు డ్యాన్స్‌లు వేశారు. ( ఈ పాప హాబీ ఏంటో తెలుసా? )

బోస్టన్‌ మెడికల్‌ సెంటర్‌ సీఈఓ కేట్‌ వాల్ష్‌‌ ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘ ఫ్రంట్‌ లైన్‌ సిబ్బంది కోసం వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. వ్యాక్సిన్లు వస్తున్నందుకు ఈ సంబరాలు. ఓ గొప్ప రోజు.. ఓ గొప్ప ప్రదేశంలో’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ప్రజల్లో​ నమ్మకం కలగటం ఆనందంగా ఉంది..  నేనింక ఆగలేను.. అద్భుతంగా ఉంది.. మీ వెంట లక్షల మందిమి ఉన్నాం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు