‘వ్యాక్సిన్ల’ పై బ్రెజిల్‌ గుణపాఠం

10 Dec, 2020 14:50 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఎదుర్కొనే పలు కోవిడ్‌ వ్యాక్సిన్ల కోసం ప్రపంచమంతా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుండగా, బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సోనారో మాత్రం పూర్తి నిర్లిప్తంగా ఉన్నారు. ‘నేను వ్యాక్సిన్‌ తీసుకునే ప్రసక్తే లేదు’ అంటూ ఆయన నవంబర్‌ 26వ తేదీ నుంచి సోషల్‌ మీడియా ముఖంగా చెబుతూ వస్తున్నారు. ఆయన మాస్కులు ధరించడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. గత జూలై నెలలో కరోనా వైరస్‌ బారిన పడిన బోల్సోనారో దంపతులు దాని నుంచి కోలుకునే వరకు 20 రోజులపాటు గహ నిర్బంధంలో గడిపారు. 

స్వయంగా కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న బోల్సోనారో ఇప్పుడు కోవిడ్‌ వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాక్సిన్లను వ్యతిరేకించడం బ్రెజిల్‌ చరిత్రలోనే ఉంది. స్మాల్‌పాక్స్‌ (మశూచి, అమ్మవారు) నుంచి రక్షణకు వాక్సిన్‌ తీసుకోవడం తప్పనిసరంటూ 1904 నవంబర్‌ నెలలో బ్రెజిల్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రీ డి జెనిరో నగరంలో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా పత్రికల్లో కూడా ఎన్నో కార్టూన్లు వచ్చాయి. 1898 నుంచి 1904 వరకు మధ్యకాలంలో రియో డి జెనిరో నగరవాసుల్లో కేవలం రెండు నుంచి పది శాతం మంది మాత్రమే వ్యాక్సిన్లు తీసుకున్నట్లు చరిత్రకారుడు సిడ్నీ చాల్హాబ్‌ తెలియజేశారు.

1904లో మశూచి కారణంగా రియో నగరంలో 0.4 శాతం మంది మత్యువాత పడ్డారు. ప్రస్తుతం కోవిడ్‌ వల్ల న్యూయార్క్‌ నగరంలో మరణించిన వారి కన్నా ఎక్కువ మంది మత్యువాత పడడంతో అక్కడి ప్రభుత్వం ఆగమేఘాల మీద స్మాల్‌పాక్స్‌ వ్యాక్సిన్‌ను తీసుకొచ్చి మశూచి టీకాలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.నగరవాసుల శ్రేయస్సు కోసమే కాకుండా దేశ ఆధునీకరణలో భాగంగా విదేశీ పెట్టుబడులను, విదేశీ వలసలను ప్రోత్సహించడంలో భాగంగా కూడా టీకాలను తప్పనిసరి చేసింది. ఒక్క మశూచే కాకుండా ఎల్లో ఫీవర్‌ (మన్యజ్వరం), ప్లేగ్‌ వ్యాధులను కూడా తమ దేశం నుంచి సమూలంగా నిర్మిస్తామంటూ అప్పటి దేశాధ్యక్షుడు రోడ్రిగ్స్‌ అల్వెస్‌ విదేశీ పెట్టుబడిదారులకు హామీ ఇచ్చి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా 1903 నుంచి 1909 మధ్యకాలంలో రియో డి జెనిరో నగరంలో పరిశుభ్రత పరిరక్షణకు అనువుగాలేని పలు భవనాలు కూల్చి వేయించారు. వాటిల్లో నివసిస్తున్న దాదాపు 40 వేల మంది ఇటాలియన్, పోర్చుగీసు, ఆఫ్రో–్ర»ñ జిలియన్‌ పేదలను నగరం నుంచి తరిమేశారు. సాయుధ పోలీసుల భద్రత మధ్య వైద్యాధికారులు ప్రతి ఇంటికి వెళ్లి శానిటైజ్‌ పనులు చేపట్టారు. ప్రజలు నాడు వ్యాక్సిన్లను వ్యతిరేకించడానికి ఇలా వైద్యాధికారులు ఇళ్లలోకి చొచ్చుకు రావడం ఒక కారణమైతే టీకాలు ఇచ్చేందుకు అప్పట్లో ఉపయోగించిన సిరంజీలు కూడా లావుగా పెద్దవిగా ఉండడం, వాటితోని  ‘సిఫిలీస్‌’ లాంటి అంటు రోగాలు రావడం మరో కారణం. ప్రభుత్వ నిర్బంధ ఆరోగ్య చర్యలను వ్యతిరేకిస్తూ 1904, నవంబర్‌ నెలలో వేలాది మంది ప్రజలు రియో నగరం వీధుల్లోకి వచ్చారు. దేశాధ్యక్షులు అల్వెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే అదనుగా భావించిన ఆయన ప్రత్యర్థి రాజకీయ నేతలు రంగంలోకి దిగి ప్రజలను రెచ్చ గొట్టారు. 

విభిన్న జాతులు గల భవన నిర్మాణ కార్మికులు, రేవు కార్మికులు, విద్యార్థులు రాళ్లు, రంపాలు, గొడ్డళ్లు, కర్రలతో వైద్య సిబ్బంది, సాయుధ పోలీసులపై దాడులు జరిపారు. ఆరు రోజులపాటు ఈ విధ్వంసకాండ చెలరేగింది. మరోపక్క ప్రత్యర్థి రాజకీయ నేతలు, యువ సైనిక అధికారులతో అల్వెస్‌ను పడగొట్టేందుకు సైనిక కుట్ర పన్నారు. అయితే వారికి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా నగరంలో ప్రజాందోళనలను అణచివేయడానికి దేశాధ్యక్షుడు సైనిక దళాలను రంగంలోకి దింపారు. అల్లర్లను సమర్థించిన పలు పత్రికల న్యూస్‌ ఎడిటర్లు తమ వైఖరిని మార్చుకున్నారు. ముందుగా ప్రజా స్పందన, ప్రజాందోళనగా పేర్కొన్న పత్రికలు ఆ తర్వాత ఆ అల్లర్లను అల్లరి మూకల అలజడిగా పేర్కొన్నాయి. నాలుగేళ్ల తర్వాత రియో నగరంలో మశూచి ప్రభలడంతో నగర జనాభాలో ఒక శాతం మంది ప్రజలు మత్యువాత పడ్డారు. అప్పటి నుంచి బ్రెజిల్‌ ప్రభుత్వం అన్ని అంటురోగాల వ్యాక్సిన్లను తప్పనిసరి చేసింది. ఆ విషయమై ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికి ఎంతో ప్రచారం చేసింది. దీంతో 1990 దశకంలో 95 శాతం దేశ ప్రజలు స్వచ్ఛందంగా టీకాలు వేయించుకున్నారు. ఇప్పుడు బ్రెజిల్‌లో కరోనా  విజంభణ కొనసాగుతోంది. ఈ చరిత్రను పరిగణలోకి తీసుకోకుండా, వ్యక్తిగత హక్కుకు ప్రాధాన్యతను ఇస్తానని చెప్పుకునే బ్రెజిల్‌ ప్రస్తుత అధ్యక్షుడు బోల్సోనారో తాను వ్యాక్సిన్‌ తీసుకోనని చెబుతున్నారు. 
 

>
మరిన్ని వార్తలు