ప్రజల్లో తగ్గుతోన్న కరోనా ‘యాంటీ బాడీస్‌’

29 Oct, 2020 14:14 IST|Sakshi

ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడిన వారు ప్రాణాలతో బయట పడాలంటే వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే ‘యాంటీ బాడీస్‌ (రోగ నిరోధక శక్తి)’ శరీరంలో పెంచుకోవడం ఒక్కటే మార్గమని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్తలు మొదటి నుంచి చెబుతున్న విషయం తెల్సిందే. ఎందుకంటే కరోనా చికిత్సకు సరైన మందు ఇంతవరకు లేకపోవడమే. రోగ నిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్లు కూడా ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో సహజ సిద్ధంగా అంటే ఆరోగ్యకరమై ఆహారంతోపాటు శారీరక వ్యాయామం చేయడం మరో మార్గమని కూడా వైద్యులు సూచిస్తూ వస్తున్నారు. కొందరిలో సహజ సిద్ధంగానే రోగ నిరోధక శక్తి ఉంటుంది. (డిసెంబర్‌లో కరోనా వ్యాక్సిన్‌)

అయితే ఈ రోగ నిరోధక శక్తి బ్రిటీష్‌ ప్రజల్లో క్రమంగా తగ్గుతూ వస్తోందని తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తేటతెల్లం అవడం ఆందోళనకరమైన విషయం. కరోనా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరగుతున్న నేపథ్యంలో రోగ నిరోధక శక్తి కూడా ప్రజల్లో అదే శాతంలో లేదా అంతకన్నా ఎక్కువ మందిలో పెరగుతూ రావాలి. కానీ అందుకు విరుద్ధంగా తగ్గడం బ్రిటీష్‌ శాస్త్రవేత్తలకు అంతుపట్టకుండా ఉంది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీ బాడీస్‌కు సంబంధించి గత జూన్‌ నెలలో నిర్వహించిన పరీక్షల్లో బ్రిటన్‌ జనాభాలో ఆరు శాతం జనాభాలో యాంటీ బాడీస్‌ ఉన్నట్లు తేలింది. సెప్టెంబర్‌ నెల నాటికి యాంటీ బాడీస్‌ కలిగిన వారి సంఖ్య 4.4 శాతానికి పడిపోయిందని తేలింది. దేశంలోని మొత్తం జనాభాకుగాను దేశ నలుమూలల నుంచి 3,65,000 మంది శాంపిళ్లను సేకరించడం ద్వారా ‘రియాక్ట్‌ 2’ పేరిట పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడయింది.  (సెకండ్‌ వేవ్‌ మొదలైంది.. మళ్లీ లాక్‌డౌన్‌)

ప్రజల్లో యాంటీ బాడీస్‌ తగ్గిపోవడం అంటే వారిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే శక్తి తగ్గిపోవడం కనుక ప్రజలు ఈ విషయంలో ఆందోళన చెందడం సహజమే. కొన్ని సందర్భాంలో ప్రజల్లో యాంటీ బాడీస్‌ పడి పోవడం కూడా సాధారణమేనని, మెమోరీ సెల్స్‌గా పిలిచే బీ సెల్స్‌ పడి పోకూడదని, తాము జరిపిన పరిశోధనల్లో బీ సెల్స్‌ పడిపోయాయా లేదా అన్న అంశాన్ని పరిశోధించలేదని, ఈ కారణంగా యాండీ బాడీస్‌ పడి పోవడం పట్ల అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. వ్యాక్సిన్ల వల్ల కూడా యాండీ బాడీస్‌ పెరగుతాయని వారు చెప్పారు. (భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ అప్పుడే!)

మరిన్ని వార్తలు