CoronaVirus: చైనా రహస్య పత్రం ఏం చెబుతోంది..?

16 May, 2021 03:07 IST|Sakshi

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ దానికదే వ్యాపించడం మొదలైందా? పరిశోధనలు చేస్తుండగా పొరపాటున లీకైందా? ఎవరైనా జన్యుమార్పిడి చేసి జీవాయుధంగా మార్చి వదిలారా? అన్నదానిపై మొదటి నుంచీ సందేహాలు ఉన్నాయి. అన్ని అనుమానాలూ చైనాపైనే ఉన్నాయి. ఈ సందేహాలను బలోపేతం చేసేలా.. చైనా మిలటరీ సైంటిస్టులకు చెందిన పరిశోధనా పత్రం లీకైంది. ఈ వివరాలతో ది ఆస్ట్రేలియన్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ వివరాలివి..
 – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

వూహాన్‌లో ఏం జరిగింది? 
కోవిడ్‌–19 ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పరిశోధన చేస్తున్న అమెరికన్‌ అధికారులకు చైనాకు చెందిన ఓ రహస్య పరిశోధనా పత్రం దొరికింది. ‘‘మనుషులు సృష్టించిన సార్స్, ఇతర కొత్త వైరస్‌లను జన్యు మార్పిడి చేసి జీవాయుధాలుగా వినియోగించడం (ది అన్‌నాచురల్‌ ఆరిజిన్‌ ఆఫ్‌ సార్స్‌ అండ్‌ న్యూ స్పీషీస్‌ ఆఫ్‌ మ్యాన్‌మేడ్‌ వైరసెస్‌ యాజ్‌ జెనెటిక్‌ బయో వెపన్స్‌)’’ అనే శీర్షికతో చైనా మిలటరీ సైంటిస్టులు, ఉన్నతాధికారులు రాసిన పత్రం అది. కరోనా ప్రబలడానికి ఐదేళ్ల ముందే అంటే 2015లోనే ఈ పత్రాన్ని రాయడం గమనార్హం. దీనికి సంబంధించి ది ఆస్ట్రేలియన్‌ పత్రిక ‘వాస్తవంగా వూహాన్‌లో జరిగిందేమిటి?’ అనే పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. 

ఆ పేపర్‌లో ఏముంది? 
‘సరికొత్త జెనెటిక్‌ ఆయుధాల శకంలో సార్స్‌ కరోనా వైరస్‌లు ఓ భాగం. మనుషులకు వ్యాధులు కలిగించే వైరస్‌లుగా వాటిలో కృత్రిమంగా మార్పులు చేయవచ్చు. తర్వాత బయో ఆయుధాలుగా మార్చి ప్రయోగించవచ్చు.’ 
►చైనాకు చెందిన ఈ రహస్య పత్రాలను సిద్ధం చేసిన 18 మందిలో ఆ దేశ ఆర్మీ (పీఎల్‌ఏ) శాస్త్రవేత్తలు, ఆయుధ నిపుణులు, పబ్లిక్‌ హెల్త్‌ ఉన్నతాధికారుల పేర్లు కూడా ఉన్నాయి. 

జీవాయుధాలతోనే మూడో ప్రపంచ యుద్ధం
మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే జీవాయుధాలతోనే జరుగుతుందని చైనా రహస్య పత్రంలో పేర్కొన్నారు. జీవాయుధాలను ప్రయోగించడం ద్వారా శత్రుదేశ వైద్యారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని చైనా ఆర్మీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 

సార్స్‌ కూడా  జీవాయుధమే! 
2003లో చైనాను, మరికొన్ని దేశాలను వణికించిన ‘సార్స్‌ (సీవర్‌ ఆక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌)’ వైరస్‌ కచ్చితంగా మనుషులు తయారు చేసిన జీవాయుధమే అయి ఉంటుందని రహస్య పత్రంలో పేర్కొన్నారు. ఉగ్రవాదులు దానిని ఉద్దేశపూర్వకంగానే ప్రయోగించి ఉంటారని అంచనా వేశారు. 

ల్యాబ్‌ నుంచి లీకైందా.. కావాలనే వదిలారా? 
వూహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీకైందని మొదటి నుంచీ అనుమానాలు ఉన్నాయి. అయితే ల్యాబ్‌ నుంచి లీకైందని గానీ, ఉద్దేశపూర్వకంగానే వదిలారని గానీ కచ్చితమైన ఆధారాలు ఏమీ ఇప్పటివరకు లభించలేదు. 
►ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ టెడ్రోస్‌ కూడా వూహాన్‌ ల్యాబ్‌ లీకేజీ అంశాన్ని కొట్టిపారేయలేదు. ఆ కోణంలో మ రింత పరిశీలన జరగాల్సి ఉందని అన్నారు. 

ఎన్నో ఆందోళనలు 
చైనా కొన్నేళ్లుగా వూహాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో ప్రమాదకరమైన కొత్త వైరస్‌లను సృష్టించి, పరిశోధనలు చేస్తోంది. వేగంగా విస్తరించి, వేగంగా చంపేయగల సామర్థ్యం ఉన్న వైరస్‌లను సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. 
►లీకైన రహస్య పత్రాన్ని బట్టి జీవాయుధాల పట్ల చైనా తీరు ఏమిటో స్పష్టమవుతోందని, అందరూ దృష్టిసారించాల్సిన అంశం ఇది అని బ్రిటన్‌ ఎంపీ టామ్‌ టుగెండాట్‌ ఇటీవలే విమర్శించారు. 

మరెన్నో సందేహాలు 
కరోనా వైరస్‌ మూలాలపై అంతర్జాతీయ దర్యాప్తునకు చైనా ఎందుకు విముఖత చూపుతోందనే దానికి.. ఇప్పుడు బయటపడ్డ రహస్య పత్రమే సమాధానం చెప్తోందని ఆస్ట్రేలియన్‌ స్ట్రాటజిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీటర్‌ జెన్నింగ్స్‌ అన్నారు.  
ళీ రహస్య పత్రంలోని అంశాలు చైనాపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని బ్రిటన్‌ ఎంపీ టామ్, ఆస్ట్రేలియా రాజకీయ నాయకుడు జేమ్స్‌ పీటర్సన్‌ స్పష్టం చేస్తున్నారు. 

ఆ రిపోర్టు తప్పు:  చైనా 
ది ఆస్ట్రేలియన్‌ ప్రచురించిన ఆర్టికల్‌ను చైనా అధికార వార్తా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ తప్పుపట్టింది. ‘కరోనా మూలాలపై చైనాను ఇరుకున పెట్టేందుకు వాస్తవాలను వక్రీకరించారు. అదొక కుట్ర సిద్ధాంతం’ అని పేర్కొంది.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు