-

Corona Cases: కరోనా మళ్లీ విజృంభణ.. ఒక్కసారిగా పెరుగుతున్న కేసులు! భారత్‌లోనూ కరోనా మరణాలపై ఆందోళన!

15 Mar, 2022 16:26 IST|Sakshi

ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ఉధృతి తర్వాత Covid-19 కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో మరో వేవ్‌ ఉండబోదంటూ వైద్య నిపుణులు సైతం ఉపశమనం ఇచ్చే వార్త చెప్పారు. మరి వేరియెంట్‌.. అదీ ప్రమాదకరమైంది పుట్టుకొస్తే తప్పా భయాందోళనలు అక్కర్లేదంటూ ప్రకటనలు చేశారు. ఈ తరుణంలో అటు అమెరికాలో, ఇటు చైనాలో, ఇంకోపక్క యూరప్‌ దేశాల్లోనూ కరోనా కేసులు పెరిగిపోతున్న ట్రెండ్‌ కనిపిస్తోంది.

కొవిడ్‌-19 ట్రెండ్స్‌ను మానిటర్‌ చేస్తున్న వేస్ట్‌వాటర్‌ నెట్‌వర్క్‌ నివేదికల ప్రకారం.. అమెరికాలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్య కరోనా కేసుల ఈ పెరుగుదల స్పష్టంగా కనిపించింది. కిందటి నెల ఇదే టైంలో ఈ కేసుల సంఖ్య తక్కువగా నమోదు అయ్యాయి. 

కారణాలు.. స్కూల్స్‌ రీ ఓపెనింగ్‌, ఆఫీసులకు తిరిగి వెళ్తుండడం, మాస్క్‌ నిబంధనల సడలింపు కారణాల అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు వేడిమి పరిస్థితులతో జనాలు బయటే ఎక్కువగా తిరుగుతున్నారు. ఈ తరుణంలో.. వైరస్‌ విజృంభిస్తోందని అంచనా వేస్తున్నారు.

 

బ్లూమరాంగ్‌ డేటా రివ్యూ ప్రకారం.. 530 మురుగు నీటి పర్యవేక్షణ ప్రాంతాల నుంచి శాంపిల్స్‌ సేకరణ ద్వారా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇందులో మార్చి 1-10వ తేదీల మధ్య 59శాతం కేసులు తగ్గుముఖం పట్టగా, 5 శాతం కేసులు స్థిరంగా ఉన్నాయి. అయితే 36 శాతం కేసులు పెరిగినట్లు చూపించాయి. 

ఈ సర్వేలో ఎంత మేర కేసులు పెరుగుతున్నాయనేది చెప్పకపోయినా.. మురుగు నీటి sewer water లో వైరస్‌ జాడ గుర్తించినట్లు తెలిపారు. న్యూయార్క్‌తో సహా పలు ప్రాంతాల్లో కేసులు విపరీతంగా పెరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి. ‘‘ఈ ప్రస్తుత ట్రెండ్ మునుముందు కూడా కొనసాగుతుందా? పెరుగుదల ఇలాగే ఉంటుందా? అనే దానిపై నిర్ధారణకు రావడం తొందరపాటు చర్యే అవుతుందని, స్థానిక ఆరోగ్య ప్రతినిధులను పర్యవేక్షణకు ఆదేశించినట్లు..  సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సీడీసీ ప్రతినిధి కిర్బీ వెల్లడించారు.

 

ఇదిలా ఉంటే.. యూరోపియన్‌ దేశాల్లోనూ ఇలాంటి పెరుగుదలే కనిపిస్తోంది. జర్మనీ, స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియా.. ఇతర ఐరోపా దేశాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. గత రెండు వారాల్లో కేసులు పెరిగిపోతున్నట్లు ఆయా దేశాల కరోనా గణాంకాలు చెప్తున్నాయి. అక్కడా యూఎస్‌ తరహా వాతావరణం, ఉక్రెయిన్‌ యుద్ధ హడావుడి నేపథ్యంలో వలసల కారణాలతో కేసులు పెరిగిపోతుండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఇక కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ పరిణామంతో ప్రపంచం ఉలిక్కి పడింది. కరోనా మొదలైనప్పటికీ ఆ దేశంలో హయ్యెస్ట్‌ కేసులు సోమవారం నమోదు కావడం విశేషం. ఏకంగా 5,280 కేసులు నమోదు అయ్యాయి అక్కడ. ఈ నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచిన డ్రాగన్‌ సర్కార్‌.. కఠిన లాక్‌డౌన్‌తో కట్టడికి ప్రత్నిస్తోంది.  హాంకాంగ్‌లోనూ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి.

 

భారత్‌లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. వరుసగా రెండోరోజు 3 వేలకు దిగువకు కేసులు నమోదైయ్యాయి. కానీ, మరణాల సంఖ్య  మాత్రం వందకు చేరువైంది. కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బులిటెన్ మంగళవారం రిలీజ్‌ చేసిన బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 7 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2 వేల 568 మందికి వైరస్‌ ఉందని తేలింది.

మొత్తం కేసుల సంఖ్య 4.29 కోట్లకు చేరింది. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా  97 మంది మృతి చెందారు. ఇందులో ఒక్క కేరళ నుంచే 78 మరణాలు నమోదయ్యాయి. గత కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. మరణాల సంఖ్యలో మాత్రం తేడా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు