కరోనా మరణమృదంగం.. ప్రపంచదేశాలు గడగడ

7 Apr, 2021 02:34 IST|Sakshi
హాంకాంగ్‌లో కోవిడ్‌ టీకా కోసం వేచి ఉన్న జనం  

ప్రపంచవ్యాప్తంగా 29 లక్షలకు చేరువలో కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య

యురోపియన్‌ యూనియన్‌లో 11 లక్షల మరణాలు

వాషింగ్టన్‌/లండన్‌: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 28 లక్షలు దాటేసింది. కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వాయువేగంగా జరుగుతున్నప్పటికీ మరణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మరణాలు నమోదవడానికి ఏడాది పడితే, ఆ తర్వాత కేవలం మూడు నెలల్లోనే మరో 8.79 లక్షల మరణాలు సంభవించి మొత్తం 28లక్షల 79వేలు దాటేశాయి. ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల మందికిపైగా వైరస్‌ బారిన పడినట్టు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా మూడు కోట్లకి పైగా కేసులతో అగ్రభాగంలో ఉంటే ఆ తర్వాత స్థానాల్లో బ్రెజిల్, భారత్‌ ఉన్నాయి. మరణాల్లో అమెరికా, బ్రెజిల్‌ తర్వాత 2 లక్షలకు పైగా మృతులతో మెక్సికో మూడో స్థానంలో ఉంది. 
 

అమెరికాలోని 50 రాష్ట్రాల్లో యూకే వేరియెంట్‌ కేసులు పెరిగాయి. 5,5 లక్షలకు పైగా మరణాలతో ఆ దేశం మొదటి స్థానంలో ఉంది.  
ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజూ నమోదయ్యే ప్రతీ 4 మరణాల్లో ఒకటి బ్రెజిల్‌ నుంచే వస్తోందని రాయిటర్స్‌ తెలిపింది.  
యూరోపియన్‌ యూనియన్‌లో అత్యధికంగా 11 లక్షల మరణాలు సంభవించాయి.  
యూరప్‌లోని మొత్తం మరణాల్లో 60 శాతం యూకే, రష్యా, ఫ్రాన్స్, జర్మనీల నుంచే వస్తున్నాయి.  
యూరప్‌ దేశాల్లో బ్రిటన్‌ లక్షా 27 వేల మరణాలతో అగ్రభాగంలో ఉంది.  
ఫ్రాన్స్, పోలండ్, హంగేరి, ఇటలీ వంటి దేశాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఇంకా అమలు చేస్తున్నారు.  
బ్రిటన్‌లో సగం జనాభాకు వ్యాక్సినేషన్‌ పూర్తి కావడంతో ఆంక్షల్ని సడలిస్తున్నారు.  
అమెరికాలో 40శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి అయింది. 


ఇమ్యూనిటీ ఉంటేనే మక్కా యాత్రకి 
రంజాన్‌ పవిత్ర మాసంలో ముస్లింలు మక్కా యాత్ర చేయాలంటే వారిలో పూర్తి స్థాయిలో ఇమ్యూనిటీ ఉండాలని సౌదీ అరేబియా తెలిపింది. హజ్‌ ఉమరాహ్‌ మంత్రిత్వ శాఖ యాంటీ బాడీలున్నవారికే మక్కా మసీదులోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవారు, ఒకసారి కరోనా సోకి పూర్తిగా కోలుకున్న వారు, యాత్రకి 14 రోజుల ముందు వ్యాక్సిన్‌ ఒక్క డోసు తీసుకున్న వారికి మాత్రమే మక్కాలోకి ప్రవేశం ఉంటుందని ఒక ప్రకటనలో వెల్లడించింది.  

చదవండి: (హెచ్చరిక: వచ్చే 4 వారాలు అత్యంత సంక్లిష్టం)

మరిన్ని వార్తలు