వర్ణ వివక్షపై ‘కరోనా’ పెంచిన విద్వేషం

21 Apr, 2021 04:17 IST|Sakshi

కంటికి కనిపించని సూక్ష్మక్రిమి
విద్వేషాగ్నిని రగిల్చింది 
కరోనా వైరస్‌ పరోక్షంగానూ 
నిండు ప్రాణాలను తీసేస్తోంది 
ఎవరో జ్వాలని రగిలిస్తే, 
మరెవరో బలైపోతున్నారు 
అసలే నల్లజాతీయులన్న వివక్ష, 
దానికి తోడు వైరస్‌ నింపిన విద్వేషం 
వెరసి అగ్రరాజ్యంలో ఆసియన్లపై 
దాడులు పెరిగిపోతున్నాయ్‌...

ఆసియన్ల పట్ల అక్కసుతో రగిలిపోతున్న అమెరికన్లు నిన్నగాక మొన్న అట్లాంటాలోని ఆసియన్‌ మసాజ్‌ పార్లర్లను లక్ష్యంగా చేసుకొని ఎనిమిది మందిని పిట్టల్లా కాల్చిపారేశారు. థాయ్‌లాండ్‌ నుంచి వచ్చిన శరణార్థిని నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి ప్రాణాలు తీశారు. ఒక ఫిలిప్పీన్‌ వ్యక్తిపై కత్తులతో దాడి చేస్తే , మరో చైనా మహిళకి నిప్పంటించి తగులబెట్టారు. ఇండియానాలో నాలుగు రోజుల కిందట ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించగా... అందులో నలుగురు సిక్కులు ఉన్నారు. ఇది జాతి వివక్ష దాడా? కాదా? అనేది దర్యాప్తులో తేలనుంది.

ఈ మధ్య కాలంలో అమెరికాలో ఎక్కడ చూసినా ఇలాంటి దారుణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్‌ బయటపడ్డపుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ దానిని చైనా వైరస్‌ అంటూ పదే పదే ప్రస్తావించడంతో ఆసియన్లు అంటేనే అమెరికన్లు మండిపడుతున్నారు. మొదట్నుంచి ఆసియన్లపై జాతి వివక్ష, చులకన భావం ఉండేవి. కరోనా అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేశాక విద్వేషం రెట్టింపైంది. ఆసియన్‌ అమెరికన్‌ అయిన కమలా హ్యారిస్‌ ఉపాధ్యక్షురాలి పదవిని అందుకున్నప్పటికీ ఈ విద్వేషపూరిత దాడులు ఆగడం లేదు.

కమలా హ్యారిస్‌ను చంపుతామని బెదిరించినందుకు ఫ్లోరిడాకు చెందిన ఓ 39 ఏళ్ల నర్సును గత శనివారం అరెస్టు చేశారు కూడా. జాతి వివక్ష దాడులకి వ్యతిరేకంగా పోరాడుతున్న స్టాప్‌ ఏఏపీఐ హేట్‌ న్యాయవాద సంస్థ గణాంకాల ప్రకారం గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు అమెరికా వ్యాప్తంగా ఆసియన్లను లక్ష్యంగా చేసుకొని 3,800 దాడుల ఘటనలు జరిగాయి. కరోనా విజృంభణ తర్వాత ఈ దాడుల ఘటనల్ని ఆ సంస్థ ఇంటర్నెట్‌ టూల్‌ సాయంతో సేకరించింది. వైరస్‌ వెలుగులోకి వచ్చాక ఆసియన్లపై దాడులు 150% పెరిగిపోయాయి.

కాలిఫోర్నియాలో పెరిగిన దారుణాలు
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధికంగా ఆసియన్‌ అమెరికన్లు నివసిస్తారు. తాజా అంచనాల ప్రకారం ఆ రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా ఆసియన్లు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 15 శాతానికి పైగా ఆసియన్లే. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందక ముందు, తర్వాత దాడుల్ని పరిశీలిస్తే కాలిఫోర్నియాలోని ఆరెంజ్‌ కౌంటీలో ఏకంగా 1,200% పెరిగిపోయాయని ఆసియన్‌ ఫసిఫిక్‌ పాలసీ ప్లానింగ్‌ కౌన్సిల్‌ తన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది మార్చి-మే మధ్య 34 కౌంటీలలో 800కి పైగా కరోనా వైరస్‌కి సంబంధించిన దాడులే జరిగాయి.

నేడు సెనేట్‌లో బిల్లుపై ఓటింగ్‌ 
అట్లాంటాలో కాల్పుల తర్వాత ఆ రాష్ట్రంలో పర్యటించిన అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లు ఈ తరహా ఘటనల్ని ఇకపై జరగనివ్వబోమని ఆసియన్‌ కమ్యూనిటీకి హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్థానిక ప్రభుత్వాలకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ ఒక బిల్లుని రూపొందించారు. బుధవారం ఆ బిల్లుపై సెనేట్‌లో ఓటింగ్‌ జరగనుంది. ఆసియన్లపై వివక్షాపూరిత భాషని వాడడం, హింసించడం, భౌతిక దాడులకు దిగడం వంటివాటికి అడ్డుకట్ట వేసేలా ఈ బిల్లులో అంశాలను పొందుపరిచారు.

ప్రధానంగా స్థానిక యంత్రాంగం మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే చెరి సమానమైన బలం ఉన్న సెనేట్‌లో రిపబ్లికన్‌ పార్టీ ఎంతవరకు కలిసివస్తుందోనన్న అనుమానాలున్నాయి. అందుకే సెనేట్‌ మెజారిటీ లీడర్‌ చక్‌ చమర్‌ ఈ బిల్లుని ఎవరైనా వ్యతిరేకిస్తే అంతకన్నా సిగ్గు చేటు ఉండదని వ్యాఖ్యానించారు. తప్పకుండా బిల్లు పాస్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.  

చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్‌ అమెరికాలో ఆసియన్లకి కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. ఈ వైరస్‌కి ఆసియా దేశాలే కారణమని భావిస్తున్న అమెరికన్లు వారు కనిపిస్తే చాలు అకారణంగా ఆవేశానికి లోనవుతున్నారు, దాడులకు దిగుతున్నారు. ఒక ఆసియన్‌ అమెరికన్‌ మహిళ కమలా హ్యారిస్‌ ఉపాధ్యక్షురాలు అయినప్పటికీ ఈ నేరాలు ఘోరాలు మరింత పెరిగాయే తప్ప తగ్గలేదు. బైడెన్‌ సర్కార్‌ తెస్తున్న బిల్లులో వీటికి ఏమేరకు అడ్డుకట్ట పడుతుందో చూడాలి.  

మరిన్ని వార్తలు