యూకేలో కరోనా విజృంభణ.. 20 రోజుల్లో 20లక్షల మందికి పాజిటివ్‌!

22 Oct, 2022 16:08 IST|Sakshi

లండన్‌:  కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ భయాందోళనలు పెంచుతున్నాయి. బ్రిటన్‌లో కొద్ది రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క అక్టోబర్‌ నెలలో ఇప్పటి వరకు 20 లక్షల మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క ఇంగ్లాండ్‌లోనే ప్రతి 30 మందిలో ఒకరికి కోవిడ్‌ ఉన్నట్లు ద గార్డియన్‌ వెల్లడించింది. గడిచిన వారంలోనే 17 లక్షల మందికిపైగా వైరస్‌ బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. 

‘ఇంగ్లాండ్‌ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది.’ ‍అని కోవిడ్‌-19 సర్వే చేపట్టిన సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ సారా క్రాఫ్ట్‌ తెలిపారు. ముందు ముందు మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రులు, యూకే ఆరోగ్య విభాగం విడుదల చేసిన నివేదిక ప్రకారం అక్టోబర్‌ 10తో ముగిసిన వారంలో 8,198 మంది ఆసుపత్రుల్లో చేరారు. అక్టోబర్‌ 17 వరకు 7,809 మంది చేరినట్లు తెలిసింది.

కోవిడ్‌-19 ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ ఈ నెల చివరి నాటికి మరింత విజృంభించే ప్రమాదం ఉన్నట్లు ఆరోగ్య శాఖ హెచ్చరించింది. బీఏ.5 పరివర్తనం చెంది ఒమిక్రాన్‌ బీక్యూ1.1 కొత్త వేరియంట్‌ ఉద్భవించింది. ప్రస్తుతం బీక్యూ1.1 వేరియంట్‌ రోగనిరోధక శక్తి కళ్లుగప్పి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 300లకుపైగా ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్లు గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఇదీ చదవండి: Gujarat Polls: ఆ సీట్లలో బీజేపీ ఒక్కసారి కూడా గెలవలే.. కారణమేంటి?

మరిన్ని వార్తలు