కరోనా మూలాలు ఇండియాలో : చైనా శాస్త్రవేత్తలు

28 Nov, 2020 15:22 IST|Sakshi

2019 సమ్మర్‌లోనే కరోనా ఇండియాలో పుట్టింది  చైనా శాస్త్రవేత‍్తల వాదన

షాంఘై అధ్యయనంలో తప్పుడు వాదనలు :  భారతీయ వైరాలజిస్ట్ ముఖేష్ ఠాకూర్

కొట్టి పారేస్తున్న ఇతర నిపుణులు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ పుట్టుకపై చైనా శాస్త్రవేత్తలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైరస్ పుట్టింది చైనాలోని వుహానేలోనే అని అమెరికా సహా ప్రపంచంలోని అనేక దేశాలు వాదిస్తున్నాయి. అయితే తాజాగా ఈ మహమ్మారి వైరస్ భారత్ లేదా బంగ్లాదేశ్‌లో పుట్టి ఉండొచ్చని  షాంఘై ఇన్స్‌స్టిటయూట్‌ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు తాజా పరిశోధనాలో కొత్తవాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వీరి వాదన ప్రకారం, గత ఏడాది డిసెంబర్‌లో వుహాన్‌లో వైరస్ వ్యాప్తికి ముందే భారత ఉపఖండంలో సదరు వైరస్ ఉనికిలో ఉందని పేర్కొన్నారు.  నవంబర్ 17న మెడికల్ జర్నల్ ది లాన్సెట్  ప్రిప్రింట్ లో ‘ది ఎర్లీ క్రిప్టిక్ ట్రాన్స్‌మిషన్ అండ్ ఎవల్యూషన్  ఆఫ్‌ సార్స్-కోవ్ -2 ఇన్‌ హ్యమూన్‌  హోస్ట్స్‌’  పేరుతో ఇది ప్రచురితమైంది. 

చైనీస్‌ వైరస్‌ అంటూ కరోనా వైరస్‌ పుట్టుకపై రేగిన దుమారం, భారత చైనా మధ్య రాజకీయ ఉద్రిక్తతల మధ్య  చైనా  తాజా వాదన  అగ్నికి ఆజ్యం పోస్తోంద. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బృందం వూహాన్‌లో కరోనాను గుర్తించకముందే 2019 వేసవిలోనే భారతదేశంలో ఇది ఉద్భవించిందని తెలిపింది. కోవిడ్‌-19 అసలు తమ దేశంలో పుట్టలేదని దీనికి, తగిన ఆధారాలున్నాయని పరిశోధకులు అంటున్నారు.  జంతువుల నుంచి కలుషితమైన నీటి ద్వారా కరోనా వైరస్ మానవులలోకి ప్రవేశించిందని చైనా బృందం పేర్కొంది. కరోనా వైరస్ మూలాన్ని గుర్తించడానికి చైనా బృందం ఫైలోజెనెటిక్ విశ్లేషణను చేస్తోంది. ఈ పద్ధతి ద్వారా వుహాన్‌లోది 'ఒరిజినల్' వైరస్ అనే వాదనను తోసిపుచ్చింది. దీనికి బదులుగా బంగ్లాదేశ్, యుఎస్‌ఎ, గ్రీస్, ఆస్ట్రేలియా, ఇండియా, ఇటలీ, చెక్ రిపబ్లిక్, రష్యా లేదా సెర్బియా అనే ఎనిమిది దేశాల నుంచి  వచ్చిందనే వాదనను తెరపైకి తీసుకొచ్చింది. 

విభిన్న ఉత్పరివర్తనాల ద్వారా వైరస్ మూలాన్ని గుర్తించే ప్రయత్నంలో ఈ బృందం ఫైలోజెనెటిక్ విశ్లేషణను చేసినట్టు పరిశోధన బృందం తెలిపింది. దీన్ని ప్రమాణంగా చూపుతూ, పరిశోధకులు మొదటి కేసులు వుహాన్‌లో నమోదవ్వలేదని వాదిస్తున్నారు. వైరస్ ఒకసారి పరివర్తన చెందడానికి ఎంత సమయం పడుతుందనే అంచనా, అక్కడ తీసిన నమూనాలతో పోల్చడం ద్వారా, వైరస్ మొదట భారత్‌లో జూలై లేదా ఆగస్టు 2019లో ఉద్భవించిందని వారు సిద్ధాంతీకరించారు. 2019 మే-జూన్ వరకు, ఉత్తర మధ్య భారతదేశం,పాకిస్తాన్‌లో‌ తీవ్ర వేడి గాలులు కారణంగా తీవ్రమైన నీటి సంక్షోభం సంభంవించిందనీ ఫలితంగా మనుషులు, జంతువులు ఒకే నీటిని తాగడం వల్ల పుట్టిన మహమ్మారి  ఇతర ప్రాంతాలకు విస్తరించిందని చెబుతోంది. 

మరోవైపు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న వైరాలజిస్ట్ ముఖేష్ ఠాకూర్ షాంఘై అధ్యయనం ఫలితాలను తప్పుడు వాదనలు అంటూ తోసిపుచ్చారు. మరో ప్రపంచ నిపుణుడు డేవిడ్ రాబర్ట్‌సన్ సహా మరికొంతమంది కూడా చైనా పరిశోధకుల తాజా వాదనపై సందేహాన్ని వ్యక్తం చేశారు.  కాగా  కరోనా చైనా వైరస్‌ అనే వాదనను చైనా ఖండించండం ఇదే మొదటిసారి కాదు. గతంలో యుఎస్, ఇటలీలో మొదటి కోవిడ్-19 కేసులు నమోదైనట్లు వాదించింది. అటు అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా విషయంలో చైనాపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు చైనాకు డబ్ల్యూహెచ్‌వో వత్తాసు పలుకుతోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరగాలని కూడా కొన్ని దేశాలు పట్టు బట్టాయి. ఈ నేపథ్యంలోనే 10 మంది నిపుణుల బృందంతో డబ్ల్యూహెచ్‌వో  పరిశోధన అనంతరం చైనాలో కరోనావైరస్ చైనాలోనే పుట్టి ఉండవచ్చని అంచనాకు వచ్చారు.  కానీ కరోనా వైరస్‌ పుట్టుకకు సంబంధించి వాస్తవ మూలాలపై శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు ఇంతవరకు నిర్ధారణ కాలేదు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా