అంటార్కిటికాలో ల్యాండ్‌ అయిన కరోనా

23 Dec, 2020 12:09 IST|Sakshi

36 మందికి పాజిటివ్‌

క్వారంటైన్‌కు తరలింపు

శాంటియాగో: ఇప్పటి వరకు కరోనా దూరని ప్రదేశం, ప్రాంతం ఏదైనా ఉందా అంటే అంటార్కిటికాగా చెప్పేవాళ్లం. పూర్తిగా మంచుతో కప్పబడి.. సామాన్యులు ఎవరు నివసించని ఈ ఖండం కరోనా రహిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. కానీ ఇక మీదట ఇలా పిలవడానికి వీలు లేదు. అంటార్కిటికాలో చిలీకి చెందిన ఓ పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్న 36 మందికి కోవిడ్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు చిలీ సైన్యం, ఆరోగ్య అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం వీరందరిని ఇక్కడ నుంచి తరలించి.. క్వారంటైన్‌లో ఉంచినట్లు వెల్లడించారు. ఇక కరోనా సోకిన 36 మందిలో  సైన్యానికి చెందిన వారు 26 మంది కాగా, మిగిలినవారు నిర్వహణ సిబ్బంది అని తెలుస్తోంది. ప్రస్తుతం వీరందరినీ వెనక్కి రప్పించినట్టు సమాచారం. చిలీ సైన్యం అంటార్కిటికాలో శాశ్వత సిబ్బంది పరిశోధనా కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఇది ఉత్తర అంటార్కిటికాలోని ఒక ద్వీపకల్పం కొన దగ్గర ఉంది.

చిలీ పటాగోనియాలోని మాగల్లెన్స్‌లో ఆరోగ్య అధికారులు "కరోనా బారిన పడ్డవారిని ఇప్పటికే ఇక్కడి నుంచి తరలించి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం" అని తెలిపారు. ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారని.. ఎవరి పరిస్థితి విషమంగా లేదని వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో అంటార్కిటికాకు పర్యాటకుల రాకను అక్కడి ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. గత నెల 27న చిలీ నుంచి కొన్ని సామాన్లను అంటార్కిటికాకు చేరవేశారు. ఇక్కడ వైరస్ వెలుగు చూడడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. అంతకంటే ముందు అక్కడి పర్యాటకులకు నిర్వహించిన పరీక్షల్లో అందరికీ నెగటివ్ అనే తేలింది. అంటార్కిటికాలో చాలా దేశాలు తమ క్యాంపులు ఏర్పాటు చేసుకుని పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దాదాపు 38 క్యాంపుల్లో 1000మంది వరకు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వీరందరినీ ఇప్పటికే సురక్షితంగా తరలించినట్లు బ్రిటీష్‌ అంటార్కిటికా సర్వే పరిశోధకులు తెలిపారు. (చదవండి: వందేళ్ల తర్వాత సేమ్‌ సీన్‌ రిపీట్‌..!)

మరిన్ని వార్తలు