పొట్టివాళ్లకే కరోనా ముప్పు ఎక్కువ!

7 Nov, 2020 19:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘పొట్టి వాళ్లు గట్టి వాళ్లు’ అనడం మనం వినే ఉంటాం. ప్రాణాంతక కరోనా మహమ్మారి విషయంలో ఇది చెల్లకపోగా పొడుగువాళ్లతో పోలిస్తే పొట్టివాళ్లే ఎక్కువగా కరోనా వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉందని సింగపూర్‌ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇంగ్లండ్‌తో పాటు నేడు చాలా దేశాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా రెండు మీటర్ల భౌతిక దూరాన్ని అందరు పాటించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ రెండు మీటర్ల దూరంలో ఉన్న ఓ వ్యక్తికి నిజంగా కరోనా ఉన్నట్లయితే, ఆయన లేదా ఆమె తుమ్మినా, తగ్గినా రెండు మీటర్ల దూరంలో ఉన్న ఇతరులకు ఆ వైరస్‌ సోకదా ? అన్న అంశంపై సింగపూర్‌ పరిశోధకులు కంప్యూటర్‌ స్క్రీన్‌పై డ్రాప్‌లెట్స్‌ను సృష్టించి ప్రయోగాత్మకంగా పరిశీలించి చూశారు. 

రెండు మీటర్ల దూరంలో ఉన్న కరోనా రోగి తుమ్మినా, తగ్గినా వెలువడే తుంపర్లలో చిన్నవి తొందరగా నేలకు చేరుకుంటుండా, పెద్దగా ఉన్న తుంపర్లు మెల్లగా రెండు మీటర్ల దూరం వరకు ప్రయాణించి నేల జారుతున్నాయి. ఈ క్రమంలో ఐదు మీటర్ల ఐదు అంగుళాల ఎత్తున ప్రయాణిస్తూ ఈ తుంపర్లు నేల జారుతున్నాయి. అంటే రెండు మీటర్ల దూరంలో ఐదున్నర అడుగుల ఎత్తున్న మనుషులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ముఖంపై ఈ తుంపర్లు పడే అవకాశం ఎక్కువగా ఉందన్న మాట. 

ఈ లెక్కన బ్రిటీష్‌ మహిళల సరాసరి ఎత్తు 5 అడుగుల మూడు అంగుళాలు కనుక వారి సమీపంలో కరోనా రోగి దగ్గినా, తుమ్మినా వారికి వైరస్‌ వ్యాపించే అవకాశం పూర్తిగా ఉందని ఈ అధ్యయనం ద్వారా సింగపూర్‌ పరిశోధకులు తేల్చారు. బ్రిటన్‌లో మగవారి సగటు ఎత్తు ఐదు అడుగుల తొమ్మిది అంగుళాలు కనుక వారికి అలా వైరస్‌ సోకే ప్రమాదం లేదు. ఇది ఒక్క బ్రిటన్‌లోనే కాకుండా రెండు మీటర్ల భౌతిక దూరాన్ని పాటిస్తున్న అన్ని దేశాల్లో కరోనా రోగి ఐదున్నర అడుగుల పొడవుండి తుమ్మినా, దగ్గినా అంతకన్న తక్కువుండే వారికి సోకే అవకాశం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. భారత్‌లో సగటు మహిళల ఎత్తు ఐదు అడుగులే కనుక భారత్‌లో కూడా ఇలా వైరస్‌ సోకే ప్రమాదం ఉందన్న మాట. 

మరిన్ని వార్తలు