మానవాళికి మంచిరోజులు! 

12 Aug, 2020 03:50 IST|Sakshi

రష్యాలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి

మాదే తొలి టీకా: పుతిన్‌

ఆయన కుమార్తెపై ప్రయోగం

మార్కెట్లోకి మరిన్ని వ్యాక్సిన్లు వస్తాయని ఆశాభావం  

మాస్కో: కరోనా వైరస్‌ నిరోధానికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన తొలిదేశంగా రష్యా రికార్డు సృష్టించినట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మంగళవారం ప్రకటించారు. వైరస్‌ నిరోధానికి ఈ స్పుత్నిక్‌–5 టీకా అద్భుతంగా పనిచేస్తుందని స్థిరమైన రోగ నిరోధక స్పందనను కలగజేస్తుందని స్పష్టం చేసిన పుతిన్‌ ఇప్పటికే తన కుమార్తెల్లో ఒకరికి ఈ టీకా ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ సమావేశం ఒకదాంట్లో పుతిన్‌ మాట్లాడుతూ టీకా అభివృద్ధి ప్రపంచం మొత్తానికి ఓ ముఖ్యమైన ఘట్టమని అభివర్ణించారు. తన కుమార్తె తొలి దఫా టీకా వేసుకున్న తరువాత శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీ సెల్సియస్‌ వరకూ పెరిగిందని, ఒక రోజు తరువాత 37 డిగ్రీలకు చేరుకుందని ఆయన వివరించారు. (రష్యా వ్యాక్సిన్‌ను నమ్మలేమంటున్న సైంటిస్ట్‌లు!)

రెండో డోస్‌ తరువాత కూడా ఉష్ణోగ్రత కొంత పెరిగినా ఆ తరువాత ఏ సమస్య లేదని, శరీరంలో యాంటీబాడీలు తగినంత ఉత్పత్తి అయినట్లు తెలిసిందని వివరించారు.  సమీప భవిష్యత్తులోనే టీకాను పెద్ద ఎత్తున తయారు చేస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘‘విదేశాల్లో టీకా కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా త్వరగా విజయం సాధించాలని కోరుకుంటున్నా. మార్కెట్‌లో బోలెడన్ని ఉత్పత్తులు అందుబాటులో రానున్నాయి’’అని పుతిన్‌ వ్యాఖ్యానించినట్లు స్పుత్నిక్‌ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. టీకాను అభివృద్ధి చేసిన గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు బిన్నోఫార్మ్‌ అనే కంపెనీలో వాణిజ్య ఉత్పత్తి జరుగుతుందని, చాలా దేశాలు టీకా సరఫరా కోసం సంప్రదిస్తున్నాయని రష్యా ఆరోగ్య మంత్రి మురాష్కో తెలిపారు. 

మానవాళి మొత్తం ఏకమై కరోనా మహమ్మారిపై చేస్తున్న యుద్ధం ముగింపునకు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కోవిడ్‌ రాకుండా నిలువరించే వ్యాక్సిన్‌ను తయారు చేయటంలో ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు నిమగ్నమై ఉండగా... తొలిసారి తాము ఆ ఘనతను సాధించినట్లు రష్యా ప్రకటించింది. తమ దేశంలో దీనికి తొలి టీకా అందుబాటులోకి వచ్చిందని తన కుమార్తెల్లో ఒకరికి దీన్ని ఇచ్చామని సాక్షాత్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. దీనిపై కొందరికి సందేహాలున్నా... వ్యాక్సిన్‌ ప్రయత్నాల్లో నిస్సందేహంగా ఇది ముందడుగేనని చెప్పొచ్చు.  

ప్రయోగ దశలపై అనుమానాలు
రష్యాలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడిమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రెండు టీకాలను అభివృద్ధి చేసింది. వీటిని మానవులపై పరీక్షించేందుకు రష్యా ఏప్రిల్‌లో అనుమతులు జారీ చేసింది. అంతేకాకుండా.. టీకా ప్రయోగాలు వీలైనంత వేగంగా జరిగేందుకు ప్రభుత్వం సహకరించాలని, వేగంగా అనుమతులు జారీ చేయాలని పుతిన్‌ స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. టీకా ప్రయోగాల కోసం 18 – 65 మధ్య వయస్కులను ఎన్నుకున్నారు. మహిళలు, పురుషులు ఇద్దరిపై ప్రయోగాలు జరిగాయి. తొలి దశలో భాగంగా 18 మందికి జూన్‌ 18న, రెండో దశలో 20 మంది కార్యకర్తలకు జూన్‌ 23న టీకాలు ఇచ్చారు. రెండు బృందాల్లోని కార్యకర్తల్లో కరోనా వైరస్‌ నిరోధానికి అవసరమైన ప్రతిస్పందన కనిపించింది. కొందరు తలనొప్పి, జ్వరం వంటి వాటితో ఇబ్బందిపడినప్పటికీ టీకా ప్రయోగించిన 24 గంటల్లో ఈ లక్షణాలన్నీ తగ్గిపోయాయని యూనివర్సిటీ తెలిపింది.

కార్యకర్తలందరినీ 28 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచారు. విడుదలైన తరువాత కూడా వైద్యులు వీరిని కనీసం ఆరునెలలపాటు పరిశీలిస్తారని తెలుస్తోంది. గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ఈ టీకాను బర్డెంకో మిలిటరీ ఆసుపత్రిలోనూ పరీక్షించారు. గమలేయా డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ తెలిపిన ప్రకారం.. ఈ టీకాను రెండు డోసులుగా తీసుకుంటే రెండేళ్లపాటు కరోనా వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుంది. ఒకే రకమైన జన్యువులను వేర్వేరు వాహకాల ద్వారా ఇవ్వడం వల్ల దీర్ఘకాలంలో మాత్రమే లభించే నిరోధకత వేగంగా సంక్రమిస్తుందని ఆయన అంటున్నారు. అయితే గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన టీకాలు రెండూ మానవ ప్రయోగాలన్నీ పూర్తి చేసుకున్నాయని రష్యా చెబుతుండగా.. డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం వీటిని తొలిదశలో ఉన్న టీకాలుగా మాత్రమే చూపుతోంది. డబ్ల్యూహెచ్‌ఓ వెబ్‌సైట్‌లో కోవిడ్‌–19 టీకా ప్రయోగాలపై ఉన్న సమాచారం ప్రకారం చైనాకు చెందిన సైనోవాక్, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ/ఆస్ట్రాజెనెకాల టీకాలు మాత్రమే మూడో దశ మానవ ప్రయోగాల దశకు చేరుకున్నాయి. టీకా విడుదలకు తమకు సమయం పడుతుందని ఈ సంస్థలు చెబుతున్నాయి. (20 దేశాల నుంచి బిలియన్‌ డోసులు ప్రి ఆర్డర్‌‌)

మరిన్ని వార్తలు