రష్యన్ కాస్మోనాట్‌ను ప్రతిబింబించే బార్బీ బొమ్మ

23 Mar, 2021 14:51 IST|Sakshi

డ్రస్‌ ఏదైనా బార్బీ బొమ్మలు ముచ్చటగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ‘బార్బీ’ డాల్స్‌కున్న క్రేజ్‌ అంతా ఇంతాకాదు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ బొమ్మలను ఇష్టపడతారు. అందమైన అమ్మాయిలను ప్రతిబింబించేలా చూడముచ్చటగా బార్బీ సంస్థ ఈ బొమ్మలను రూపొందిస్తోంది. అయితే సంస్థ తయారుచేసే ప్రతిబొమ్మ వెనక ఒక నేపథ్యం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌ అవుతోన్న లేటెస్ట్‌ ఫ్యాషన్స్‌ను ప్రతిబింబించేలా బొమ్మలను రూపొందించే బార్బీ సంస్థ ఈ సారి సరికొత్త థీమ్‌తో ముందుకొచ్చింది. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు.. ధైర్యంగా, సాహోసోపేతంగా ముందుకుసాగే మహిళలను ప్రతిబింబించే విధంగా బార్బీ బొమ్మలను రూపొందించింది. ఈ క్రమంలోనే బాలికలు, మహిళల్లో స్ఫూర్తి నింపేందుకు రష్యన్‌ మహిళా కాస్మోనాట్‌ ‘అన్నా కికినా’ రూపంలో బార్బీ బొమ్మను తయారు చేసింది. 

సోవియట్‌ యూనియన్‌ ప్రయోగించిన ‘ఫస్ట్‌ క్రూయిడ్‌ స్పేస్‌కాఫ్ట్‌’ ఈ ఏడాది ఏప్రిల్‌ 12 నాటికి అంతరిక్షంలోకి వెళ్లి 60 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా బార్బీ సంస్థ రెండు సరికొత్త బొమ్మలను ఆవిష్కరించింది. ప్రస్తుతం రష్యా స్పేస్‌ టీమ్‌లో ఉన్న ఏకైక మహిళా కాస్మోనాట్‌ ‘అన్నా కికినా’ రూపంతో బార్బీ బొమ్మలను తయారు చేసింది. అచ్చం అన్నా లా కనిపించే ఈ బార్బీ బొమ్మలు తెలుపు, నీలం రంగు డ్రెస్‌లతో ఉన్నాయి. వ్యోమగామి ధరించే తెల్లని సూట్‌తోపాటు, జెట్‌ బ్లూ జంప్‌సూట్‌తో ధరించిన ఈ బార్బీడాల్స్‌పై అన్నా కికినా పేరుతోపాటు రష్యన్‌ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్‌ అధికారిక లోగో ఉండటం విశేషం. 36 ఏళ్ల కాస్మోనాట్‌ కికినా.. వాలెంటినా తెరెష్కోవా తర్వాతా ఐదో మహిళగా 2022లో అంతరిక్షంలోకి అడుగిడనుంది.

ప్రస్తుత రోజుల్లో ఇంజినీర్‌ అయిన అన్నా కికినా ఎంతోమందికి ఆదర్శమని రష్యన్‌ స్పేస్‌ ఏజెన్సీ చెప్పింది. తను ఎంతో ధైర్యవంతురాలైన మహిళే కాకుండా అందరితో కలిసిపోయే తత్వం, పరిస్థితులకు తగ్గట్టుగా సమయస్ఫూర్తితో నడుచుకునే ఎంతో తెలివైన కాస్మోనాట్‌ అని తెలిపింది. రోస్కోస్మోస్‌లో ఇప్పటిదాకా మొత్తం 124 మంది కాస్మోనాట్స్‌ ఉండగా వారిలో కేవలం నలుగురు మాత్రమే మహిళా కాస్మోనాట్స్‌. అందుకే మరింతమంది మహిళలను స్పేస్‌ ఏజెన్సీ లో పనిచేసేలా ప్రోత్సహించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పేస్‌ ఏజెన్సీ వివరించింది. 

‘‘నేను చిన్నతనంలో వ్యోమగామి కావాలని అనుకోలేదు. నా దగ్గర ఆస్ట్రోనాట్‌ రూపంలో ఉన్న బార్బీ బొమ్మ ఉంటే ఆ సమయంలో కచ్చితంగా ఆస్ట్రోనాట్‌ కావాలనే ఆలోచన వచ్చేది. బార్బీ బొమ్మతో ఆడుతున్న ప్రతీ అమ్మాయి వ్యోమగామి కావాలని అనుకోదు. ప్రతిఒక్కరికీ తమకంటూ ఒక అభిరుచి ఉంటుందని నేను భావిస్తున్నా’’ అన్నాకికినా చెప్పింది. కాస్మోనాట్‌ బార్బీ బొమ్మతో ఆడుకునే వారిలో కొంతమంది అమ్మాయిలైనా ప్రేరణ పొంది స్పేస్‌ ఏజెన్సీల్లో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తారని ఆశిద్దాం. 

మరిన్ని వార్తలు