-

Afghanistan: అశ్రఫ్‌ ఘనీ స్పందన, ఫేస్‌బుక్‌లో వీడియో

19 Aug, 2021 13:35 IST|Sakshi
అశ్రఫ్ ఘనీ (ఫైల్‌ ఫోటో)

పారిపోలేదు, రక్తపాతాన్ని నివారించేందుకే దేశాన్ని విడిచా: అశ్రఫ్‌ ఘనీ

కనీసం చెప్పులు  తీసి షూ వేసుకునే సమయం కూడా లేదు

 కట్టుబట్టలు, ఖాళీ చేతులతో వెళ్లా

కాబూల్: భారీ నగదుతో దేశం విడిచి పారిపోయాడన్న ఆరోపణలపై అఫ్గానిస్తాన్ మాజీ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ(72) స్పందించారు. నాలుగు కార్లు, హెలికాప్టర్‌ నిండా డబ్బుతో పారిపోయారన్న ఆరోపణలను కొట్టిపారేశారు. అవన్నీ  నిరాధారమైన, తప్పుడు వార్తలు అంటూ ఖండించారు. కాబూల్ నుండి పారిపోవాలనే తన నిర్ణయాన్ని ఘనీ  మరోసారి సమర్ధించుకున్నారు.  

పారిపోయిరాలేదని 'భారీ విపత్తు'ను తప్పించేందుకే దేశాన్ని విడిచిపెట్టినట్టు ఘనీ తెలిపారు. రక్తపాతాన్ని నివారించేందుకు ఇదే ఏకైక మార్గమని భావించానని పేర్కొన్నారు. తాను అక్కడ ఉండి ఉంటే కొత్త అధ్యక్షుడి కళ్ల ముందే తనను ఉరితీసేవారని వాపోయారు. ప్రస్తుతం తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆశ్రయం పొందానని తెలిపారు. ఈ మేరకు ఘనీ తన ఫేస్‌బుక్ పేజీలో ఒక వీడియోను విడుదల చేశారు. దుబాయ్‌లో ప్రవాసంలో ఉండాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన అన్నారు. అలాగే దేశంనుంచి 169 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1257 కోట్లు)  దొంగిలించాడన్న  తజికిస్థాన్‌ అఫ్గన్‌ రాయబారి ఆరోపణలను కొట్టి పారేశారు.(Afghanistan:అశ్రఫ్‌ ఘనీ ఎక్కడున్నారో తెలిసిపోయింది)

అంతేకాదు కట్టుబట్టలు, చెప్పులతో తాను అఫ్గన్‌ విడిచి వెళ్ళవలసి వచ్చిందని ఫేస్‌బుక్ వీడియోలో చెప్పుకొచ్చారు. కనీసం బూట్లు వేసుకునే అవకాశం కూడా తనకు లేకుండా పోయిందని, ఉత్త చెప్పులు, ఖాళీ చేతులతో యూఏకి చేరుకున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అఫ్గన్‌ భద్రతాదళాలకు కృతజ్ఞతలు తెలిపారు. శాంతి ప్రక్రియలో వైఫల్యమే తాలిబన్‌ ఆక్రమణకు దారితీసిందని విమర్శించారు. తాలిబన్ సీనియర్‌ నేత, ఘనీ పూర్వీకుడు హమీద్ కర్జాయ్, అబ్దుల్లా మధ్య చర్చలకు మద్దతు ప్రకటించారు. ఈ ప్రక్రియ విజయవంతం కావాలని కోరుకుంటున్నానన్నారు. దేశానికి తిరిగి రావడానికి చర్చలు జరుపుతున్నామని కూడా ఘనీ చెప్పారు. (Afghanistan: ఆమె భయపడినంతా అయింది!)

కాగా అఫ్గన్‌ 14వ అధ్యక్షుడైన అశ్రఫ్ ఘనీ మొదట సెప్టెంబర్ 20, 2014న ఎన్నికయ్యారు, ఆ తరువాత సెప్టెంబర్ 28, 2019 అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. తాలిబన్‌ అక్రమణల నేపథ్యంలో ఘనీ దేశం వదిలి వెళ్లారు. మరోవైపు మానవతా దృష్టితో ఘనీ, ఆయన కుటుంబాన్ని దేశంలోకి ఆహ్వానించామని యూఏఈ విదేశాంగ శాఖ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. (Ashraf Ghani: భారీ నగదుతో పారిపోయాడు: రష్యా)

మరిన్ని వార్తలు