Vaccine Corruption Scandal: బొల్సొనారోకు భారీ షాక్‌

4 Jul, 2021 08:53 IST|Sakshi

కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డోసుల కోసం భారత్‌ బయోటెక్‌తో బ్రెజిల్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం.. ఆపై ముడుపుల విమర్శలతో రద్దు చేసుకున్న పంచాయితీ బ్రెజిల్‌ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. రాజకీయ ఒత్తిళ్లు, ప్రజా నిరసనల మధ్య బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారోకు భారీ షాకిచ్చింది అక్కడి అత్యున్నత న్యాయస్థానం. ఈ భారీ కుంభకోణంలో బొల్సొనారోతో సహా కీలక పదవుల్లో ఉన్నవాళ్లను సైతం విచారించాలని దర్యాప్తు బృందాలను ఆదేశించింది బ్రెజిల్‌ సుప్రీం కోర్టు. 

సావ్‌ పాలో: కొవాగ్జిన్‌ డీల్‌కు సంబంధించి ముడుపుల ఆరోపణలపై, ముఖ్యంగా ఆ ఆరోపణల్లో అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో కార్యాలయం పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలని బ్రెజిల్‌ సుప్రీం కోర్టు, బ్రెజిల్‌ అత్యున్నత విచారణ&దర్యాప్తు బృందాలను ఆదేశించింది. శుక్రవారం రాత్రి హడావిడిగా ఆదేశాలను జారీ చేసిన జస్టిస్‌ రోసా వెబర్‌.. 90 రోజుల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని గడువు విధించారు. మరోవైపు బ్రెజిల్‌ కాగ్‌(సీజీయూ)ను ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరింది న్యాయస్థానం.

తగ్గని ఆగ్రహజ్వాలలు
కరోనాను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడంటూ అధ్యక్షుడికి వ్యతిరేకంగా వేల మంది యాంటీ-బొల్సొనారో ఉద్యమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనాతో ఐదు లక్షల మంది ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడంటూ బొల్సొనారోపై హత్యాయత్నం కేసులు సైతం నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్‌ ముడుపుల ఆరోపణలు రావడంతో వాళ్లలో మరింత ఆగ్రహం పెల్లుబిక్కింది. దీంతో మూడురోజులుగా రోడెక్కి నిరసనలతో హోరెత్తిస్తున్నారు. శనివారం సైతం పార్లమెంట్‌ ఆవరణలో వీళ్లు నిరసనలు చేపట్టారు. ఇక బొల్సొనారోను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. పాత-కొత్త ఆరోపణలు(కొవాగ్జిన్‌ డీల్‌ అంశం సహా), వివాదాలను ప్రస్తావిస్తూ ఈ వారంలోనే పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. చదవండి: బొల్సొనారో రక్తపిశాచి.. జనాగ్రహంతో పెరిగిన కరోనా!

అఘమేఘాల మీద రద్దు
కాగా, ఈ ఫిబ్రవరిలో కొవాగ్జిన్‌ డోసుల కోసం బ్రెజిల్ ప్రభుత్వం భారత్‌ బయోటెక్‌తో ఒప్పందం చేసుకుంది. ఒక్కో డోస్‌కు 15 డాలర్ల చొప్పున.. సుమారు 2 కోట్ల డోసుల సరఫరాకు ఆ ఒప్పందం జరిగింది. ఈ డీల్‌ విలువ  వేల కోట్లు కాగా, దాదాపు రూ.734 కోట్ల మేర ముడుపులు మధ్యవర్తి కంపెనీ ప్రిసిసా మెడికంతోస్‌తో పాటు.. బొల్సొనారోకు సైతం ముట్టినట్టు ప్రతిపక్ష సెనేటర్లు ఆరోపించారు. అయితే ఈ డీల్‌లో ఆరోపణలతో తమకు సంబంధం లేదని భారత్‌ బయోటెక్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. తమకు ముందస్తు చెల్లింపులు తమకు జరగలేదని, ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని.. అయితే అత్యవసర అనుమతులు మాత్రం ఈమధ్యే జరిగాయని భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది. ఈలోపే బ్రెజిల్‌ ప్రభుత్వం ఒప్పందం రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం.

చదవండి: వ్యాక్సిన్‌తో మొసళ్లుగా మారుతున్న మనుషులా?

మరిన్ని వార్తలు