covaxin: డబ్ల్యూహెచ్‌వో లిస్ట్‌లో లేదు!

23 May, 2021 12:57 IST|Sakshi

హైదరాబాద్‌:  ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కోవాగ్జిన్’కు కొత్త సమస్య వచ్చిపడింది. ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌లో ఇంకా కోవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్‌వో చోటు ఇవ్వలేదు. దీంతో కోవాగ్జిన్‌ డోస్‌ తీసుకున్నవాళ్లు ఎమర్జెన్సీ అవసరాల కోసం అమెరికా, యూరప్‌ దేశాలకు వెళ్లడం కుదరదు. దీంతో డబ్ల్యూహెచ్‌వో నుంచి ఎండోర్స్‌మెంట్‌ కోసం కేంద్రం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

టీకాలు వేసుకున్న విదేశీ ప్రయాణికుల కోసం అనేక దేశాలు తమ సరిహద్దులను తిరిగి తెరవడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన ఆ లిస్ట్‌లో కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు చోటు
దక్కలేదు. ఈ తరుణంలో డబ్ల్యూహెచ్‌వో నిర్ణయం.. కోవాగ్జిన్‌ డోస్‌లు తీసుకుని విదేశాలకు వెళ్దామనుకుంటున్నవాళ్లకు షాక్‌ ఇచ్చేదే!. డబ్ల్యూహెచ్‌వో తో పాటు ఇంకా చాలా దేశాలు కోవాగ్జిన్‌ను ఆమోదించలేదు. దీంతో ఇది ఇప్పటికి స్వదేశీ వ్యాగ్జిన్‌గానే ఉండిపోయింది. బ్రెజిల్‌ రెగ్యులేటరీ ఇదివరకే కోవాగ్జిన్‌కు నో చెప్పేసింది. 

కోవాగ్జిన్ డోసులు తీసుకున్నప్రయాణికులను అనుమతించేందుకు ఇప్పటికి కొన్ని దేశాలు మాత్రమే అంగీకరించాయి. మరోవైపు ఇండియాలో, యూకేలో ఉన్న కరోనా స్ట్రెయిన్స్‌పై కోవాగ్జిన్‌ సమర్థవంతంగా పని చేస్తోందని భారత్‌ బయోటెక్‌ ప్రకటించుకుంది. సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ.. డబ్ల్యూహెచ్‌వో నుంచి అనుమతి తప్పనిసరి రావాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయంతో విద్యార్థులకు ఎలాంటి సమస్య తలెత్తకూడదని కేంద్రం భావిస్తోంది. సాధారణంగా వ్యాక్సిన్‌లను అప్రూవ్‌ చేసేముందు మరింత క్లినికల్‌ డేటా, మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీస్‌ను డబ్ల్యూహెచ్‌వో పరిశీలిస్తుంది.  విదేశాంగ కార్యదర్శి హర్ష్‌ శ్రింగ్లా  సోమవారం భారత్‌ బయోటెక్‌ ప్రతినిధులతో సమావేశమై ఈ విషయంపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా 130 కి పైగా దేశాలు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెవలప్‌ చేసిన ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను అంగీకరిస్తున్నాయి.

మరిన్ని వార్తలు