Omicron Variant-Face Mask: గరిష్టానికి ఒమిక్రాన్‌ కేసులు.. అక్కడ ఇక మాస్కు తప్పనిసరి కాదు!

23 Jan, 2022 05:13 IST|Sakshi

అదనపు నిబంధనలు తొలగిస్తున్నాం

బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

లండన్‌: దేశంలో కరోనా కట్టడికి అమలు చేస్తున్న నిబంధనల్లో చాలావాటిని బ్రిటీష్‌ ప్రభుత్వం తొలగించింది. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు గరిష్టానికి చేరినందున (అంటే అంతకుమించి ఇక పెరగవని అర్థం) ఈ నిబంధనలు తొలగిస్తున్నామని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఇటీవల ప్రకటించారు. దీంతో ఇకపై ఎక్కడైన తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధన వచ్చే గురువారం నుంచి రద్దు కానుంది. అలాగే పెద్ద పెద్ద కార్యక్రమాలకు హాజరయ్యేవారు టీకా సర్టిఫికెట్‌ తప్పక తీసుకరావాలన్న నిబంధన కూడా కనుమరుగుకానుంది.

గురువారం నుంచి పాఠశాల గదుల్లో మాస్కులు తప్పనిసరి నిబంధన కూడా తొలగించనున్నట్లు ప్రధాని చెప్పా రు.  ప్రజలు వర్క్‌ ఫ్రం హోం చేయాల్సిన అవసరం లేదని, ఉద్యోగులు భౌతిక హాజరుపై తమ సంస్థలతో చర్చించాలని సూచించారు. అయితే కరోనా వ్యాప్తి నివారణకు తప్పనిసరి మాస్కుధారణ నిబం ధన కొనసాగిస్తామని స్కాట్లాండ్‌ డిప్యూటీ ఫస్ట్‌ మినిస్టర్‌ జాన్‌ స్విన్నీ చెప్పారు. బ్రిటన్‌లో లాగా తాము నిబంధనలు ఎత్తివేయడం లేదన్నారు. పార్లమెంట్‌ సూచన మేరకు నిబంధనలు కొనసాగిస్తామని, పార్లమెంట్‌ సూచిస్తే నిబంధనలు మారుస్తామని చెప్పా రు. పబ్లిక్‌ స్థలాల్లో మాస్కు ధారణ తప్పదన్నారు.  

ప్లాన్‌ బీ టు ఏ
ఓఎన్‌ఎస్‌ (ఆఫీస్‌ ఆఫ్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌) అంచనా ప్రకారం దేశమంతా ఒమిక్రాన్‌ గరిష్టానికి చేరిందని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు ప్రధాని తెలిపారు. ఓఎన్‌ఎస్‌ డేటా ప్రకారం కొన్ని ప్రాంతాలు మినహా ఇంగ్లండ్‌లో ఇన్‌ఫెక్షన్‌ స్థాయిలు పడిపోతున్నాయని వెల్లడించారు. ప్లాన్‌ బీ (తీవ్ర నిబంధనలు) నుంచి ప్లాన్‌ ఏ (స్వల్ప నిబంధనలు)కు మరలేందుకు కేబినెట్‌ అంగీకరించిందని చెప్పారు.దేశంలో ఆస్పత్రిలో చేరికలు క్రమంగా తగ్గిపోతున్నాయని, ఐసీయూ అడ్మిషన్లు కూడా పడిపోయాయని వివరించారు. సెల్ఫ్‌ ఐసోలేషన్‌ లాంటి కొన్ని నిబంధనలు మాత్రం కొనసాగుతాయన్నారు. బ్రిటన్‌లో ఈ సెల్ఫ్‌ ఐసోలేషన్‌ సమయాన్ని 7 నుంచి 5 రోజులకు గత సోమవారం నుంచి తగ్గించారు. మార్చి నాటికి సెల్ఫ్‌ ఐసోలేషన్‌ నిబంధన కూడా ఎత్తివేస్తామని బోరిస్‌ అంచనా వేశారు. కోవిడ్‌ దాదాపు ఎండమిక్‌ దశకు చేరుతోందని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచించారు.

మరిన్ని వార్తలు