బీజింగ్‌లో కోవిడ్‌ బీభత్సం

6 Jan, 2023 05:57 IST|Sakshi

బీజింగ్‌: కరోనా చైనాను చిదిమేస్తోంది. బీజింగ్‌లో కోవిడ్‌ రోగులు వెల్లువలా ఆస్పత్రులకు తరలివస్తున్నారు. నగరంలోని చుయాంగ్‌లియూ ఆస్పత్రిలో పరిస్థితే అక్కడి ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దర్పణం పడుతోంది. ఆస్పత్రిలోని బెడ్లు అన్నీ కోవిడ్‌ వృద్ధ రోగులతో నిండిపోయాయి. అయినా రోగులు వస్తుండటంతో బంధువులు వేచి ఉండే గదుల్లో, కారిడార్‌లలో వైద్యం చేస్తున్నారు. ఉన్న అన్ని వీల్‌చైర్లలో రోగులు కూర్చొనే ఆక్సిజన్‌ వెంటెలేషన్‌తో శ్వాసిస్తున్నారు. మరింత అత్యవసర వైద్యసేవలు అవసరమైన రోగులకు చికిత్సచేయడంలో వైద్యులు, నర్సులు మునిగిపోయారు.

జీరో కోవిడ్‌ పాలసీతో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు శతథా ప్రయత్నించి చైనా చేతులెత్తేయడంతో దేశంలో వైద్యారోగ్య పరిస్థితి దయనీయంగా తయారైంది. అత్యవసరమైతే తప్ప సొంతూర్లకు రావొద్దని అక్కడి హునాన్‌ప్రావిన్స్‌లోని షావోయాంగ్‌ కౌంటీ, అన్‌హుయీ ప్రావిన్స్‌లోని షాయూగ్జియాన్‌ కౌంటీలతోపాటు గన్సు ప్రావిన్స్‌లోని క్వింగ్‌యాంగ్‌ తదితర నగర పాలనాయంత్రాంగాలు ప్రజలను హెచ్చరించాయి. చైనాలో వైద్య అత్యయక స్థితిపై వాస్తవిక సమాచారం అందితే ఇతర దేశాలు సరైన విధంగా సమాయత్తం అయ్యేందుకు వీలుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అధ్యక్షుడు టెడ్రోస్‌ బుధవారం హితవుపలికారు.

మరిన్ని వార్తలు