COVID-19: చైనాలో కరోనా కేసులు ఏకంగా 90 కోట్లు!

14 Jan, 2023 04:56 IST|Sakshi

బీజింగ్‌: చైనాలో ఈ నెల 11వ తేదీ నాటికి అక్షరాలా 90 కోట్ల మంది కోవిడ్‌–19 వైరస్‌ బారినపడ్డారు. పెకింగ్‌ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ మేరకు వర్సిటీ ఒక నివేదికను విడుదల చేసింది. దేశ జనాభాలో 64 శాతం మందికి వైరస్‌ సోకిందని వెల్లడించింది. అత్యధికంగా గాన్సూ ప్రావిన్స్‌లో 91 శాతం మందికి కరోనా సోకింది. యునాన్‌ ప్రావిన్స్‌లో 84 శాతం మంది, కింఘాయ్‌ ప్రావిన్స్‌లో 80 శాతం మంది వైరస్‌ ప్రభావానికి గురయ్యారు.

చైనాలో కొత్త సంవత్సరం ఈ నెల 23న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది జనం పట్టణాల నుంచి సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు అంటువ్యాధుల నిపుణుడొకరు హెచ్చరించారు. కరోనా కొత్త వేవ్‌ ఉధృతి రెండు నుంచి మూడు నెలలపాటు కొనసాగే అవకాశం ఉందని చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ మాజీ అధిపతి జెంగ్‌ గువాంగ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు