ప్రపంచానికి శనిలా పట్టుకుంది!

24 Nov, 2020 06:25 IST|Sakshi

వివిధ దేశాల్లో భారీగా తగ్గిన ఆయు ప్రమాణాలు

కరోనా మహమ్మారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు..

వైరస్‌ నుంచి కోలుకున్నా దీర్ఘకాలిక అనారోగ్యం

7.9 శాతంగా ఉన్న పేదల జనాభా 9.4 శాతానికి..

ఒక్కసారి పట్టుకుంటే ఏళ్ల పాటు వదలదని ఏలినాటి శనికి పేరు.. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ కూడా ఇంతే! ఏడాది కాలంలో 13 లక్షలకు పైగా ప్రాణాలను బలి తీసుకున్న ఈ మహమ్మారి.. భవిష్యత్తులోనూ మానవాళికి అనేక రకాలుగా సమస్యగానే మిగిలిపోనుంది. ఆయు ప్రమాణాలను తగ్గించడం మాత్రమే కాదు.. కోట్ల మందిని పేదరికం కోరల్లోకి తోసేయనుంది!

సాక్షి, హైదరాబాద్‌: రోగమొచ్చింది.. మందేసుకున్నాం.. తగ్గింది.. హమ్మయ్య.. ఇక ఏ చింతా లేదు! ఇప్పటివరకు ఏదైనా అనారోగ్యమొస్తే మనం ఆలోచించిన తీరిది.. కానీ కోవిడ్‌ విషయంలో ఈ ఆలోచన పూర్తిగా మారి పోతోందని అంటున్నారు వైద్య నిపుణులు.. ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్న వారిలో కొంతమంది దీర్ఘకాలం పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇటీవలి కాలంలో నిర్వహించిన అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్‌ కారణంగా వచ్చే జబ్బుల ప్రభావం కొంతకాలం ఉంటుందని ఇప్పటికే తెలిసినప్పటికీ కరోనా విషయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ ప్రధానంగా ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుందని.. కానీ కొన్ని కేసుల్లో దాని ప్రభావం మెదడు, గుండెలపై కూడా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘సాధారణ శ్వాస సంబంధిత వైరస్‌లతో పోలిస్తే కరోనాలో తెలియని మిస్టరీలు చాలా ఉన్నాయి.  (ఐరోపా దేశాల్లో 17 సెకన్లకు ఒక మరణం)

రోగ నిరోధక శక్తి తగ్గుదల, దీర్ఘకాలం పాటు నిస్సత్తువ, తలనొప్పితో పాటు గుండె, శ్వాస సమస్యలు కొనసాగుతాయి..’అని మేయో క్లినిక్‌కు చెందిన శాస్త్రవేత్త గ్రెగరీ పోలాండ్‌ అన్నారు. కోవిడ్‌ వ్యాధి కణస్థాయిలో జరిపే విధ్వంసం ఇందుకు కారణమవు తుందన్నది ఆయన అంచనా.. వీటితోపాటు కొంతమంది కండ రాలు, దగ్గు వంటి లక్షణాలూ కనపరచవచ్చు. కోవిడ్‌ బారిన పడి కోలుకున్న వారి గుండె ఎక్స్‌రేలను పరిశీలించినప్పుడు కండరాలు దెబ్బతిన్నట్లు తెలిసిందని, ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లోనూ నష్టం ఎక్కువగా ఉందని మేయో క్లినిక్‌ జరిపిన పరిశోధనల ద్వారా ఇప్పటికే స్పష్టమైంది. అంతేకాకుండా.. రక్తంలో చిన్నసైజు ముద్దల్లాంటివి ఏర్పడతాయని, పెద్దసైజు వాటితో గుండెజబ్బులు వస్తే చిన్నవాటితో గుండెకు వెళ్లే చిన్న చిన్న ధమనులు మూసుకుపోతాయని చెబుతున్నారు. అయితే ఈ లక్షణాలు కోవిడ్‌ నుంచి కోలుకున్న కొందరిలో మాత్రమే కనిపిస్తుండటం కొంచెం ఊరటనిచ్చే అంశం..  (కరోనా: ఒకే ఇంట్లో ఐదురోజుల్లో ముగ్గురి మరణం​)

ఆయుః ప్రమాణాల తగ్గుదల
వైద్య సదుపాయాలు పెరగటం, ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆయు ప్రమాణాలు పెరిగాయి. అయితే కోవిడ్‌ కారణంగా ప్రభుత్వాలు ఇప్పటివరకు చేసిన శ్రమ మొత్తం నీరు కారిపోనుంది. ఆయు ప్రమాణాలు భారీగా తగ్గనున్నాయని దాదాపు మూడు దేశాల శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేస్తోంది. కాకపోతే ఇది ఆయా దేశాల్లో వ్యాధి తీవ్రత, ప్రస్తుత ఆయు ప్రమాణం తదితర అంశాలపై ఆధారపడి ఉండనుంది. పీఎల్‌ఓఎస్‌ వన్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. కోవిడ్‌ బారిన పడ్డ వారు పది శాతం వరకు ఉంటే.. అమెరికా, యూరప్, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల్లో కొత్తగా పుట్టబోయే వారి ఆయుష్షు ఏడాది వరకూ తగ్గనుంది. షాంఘై యూనివర్సిటీ, ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అప్లైడ్‌ సిస్టమ్స్‌ అనాలసిస్‌ (ఆస్ట్రియా), యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియా (యూకే) శాస్త్రవేత్తల ఈ అధ్యయనం ప్రకారం వ్యాధి తీవ్రత ఎక్కువున్న చోట్ల ఆయుష్షు 3 నుంచి 8 ఏళ్ల వరకు తగ్గవచ్చు. ఆగ్నేయాసియా దేశాల్లో ఇది రెండు నుంచి ఏడేళ్లు.. సబ్‌ సహారన్‌ ఆఫ్రికా దేశాల్లో ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఉండవచ్చు.    (రెండో దశలో కరోనా సునామీలా విజృంభించొచ్చు!)

పెరగనున్న పేదరికం...
ప్రపంచవ్యాప్తంగా గత 20 ఏళ్లుగా తగ్గుతున్న పేదల సంఖ్య కోవిడ్‌ కారణంగా ఇకపై పెరగనుంది. ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం.. ఈ ఏడాది 8.8 నుంచి 11.5 కోట్ల మంది మళ్లీ కఠిన దారిద్య్రం బారిన పడనుండగా.. ఈ సంఖ్య వచ్చే ఏడాది చివరికల్లా 15 కోట్లకు పెరుగుతుంది. రోజుకు 2 డాలర్లు లేదా రూ.150 కంటే తక్కువ ఆర్జించే వారిని పేదలుగా గుర్తించి ప్రపంచబ్యాంకు ఈ అధ్యయనం నిర్వహించింది. కోవిడ్‌ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది పేదల జనాభా 7.9 శాతంగా ఉండేదని, ఈ మహమ్మారి కారణంగా ఇప్పుడు అది 9.1 నుంచి 9.4 శాతం వరకు పెరగనుందని ఈ అధ్యయనం వివరించింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఆర్థిక వ్యూహాలతో ముందు కెళ్లాల్సి వస్తుందని తెలిపింది. ఇలా పేదరికం బారిన పడే వారిలో ఎక్కువ మంది ఇప్పటికే పేదరికం ఎక్కువున్న దేశాల్లోనే ఉండటం గమనార్హం. మధ్య ఆదాయ దేశాల్లోనూ గుర్తించదగ్గ స్థాయిలో ప్రజలు పేదలుగా మారతారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. యుద్ధాల వంటి సమస్యలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న దేశాల్లో కోవిడ్‌ గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా మారిందని తెలిపింది. ఈ పరిణామం వల్ల 2030 నాటికి పేదల జనాభాను 7 శాతం కంటే తక్కువ స్థాయికి తీసుకురావాలని ప్రపంచబ్యాంకు తీసుకుంటున్న చర్యలకు ఇబ్బంది ఏర్పడనుంది.  

>
మరిన్ని వార్తలు