మూడే నిమిషాల్లో.. బ్రీత్‌తో కరోనాతో నిర్ధారణ పరీక్షలు!

15 Apr, 2022 17:38 IST|Sakshi

భారత్‌లో ఇంకా స్వాబ్‌ టెస్టుల ఆధారితంగానే కరోనా నిర్ధారణ జరగుతోంది. అయితే చాలా చోట్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో పరీక్షల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో.. కేవలం మూడే నిమిషాల్లో కరోనాను నిర్ధారించే పరీక్షలకు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనుమతులు ఇచ్చింది.

నోటి ద్వారా ఊదినప్పుడు.. కరోనాను నిర్ధారించే డివైజ్‌ను ఉపయోగించొచ్చని ఎఫ్‌డీఏ పేర్కొంది. ఇన్‌స్పెక్ట్‌ఐఆర్‌ కొవిడ్‌-19 బ్రీతలైజర్‌గా పిలువబడే డివైజ్‌ను పరీక్షల కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. లగేజీ బ్యాగు సైజులో ఉండే ఈ డివైజ్‌ను ఆస్పత్రులు, క్లినిక్‌లు, మొబైల్‌ టెస్టింగ్‌ సైట్లలో ఉపయోగించుకునేందుకు అనుమతులు జారీ చేసింది ఎఫ్‌డీఏ.

వారానికి వంద పరికరాలను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం సదరు కంపెనీకి ఉందని, ఒకరోజులో 160 శాంపిల్స్‌ను.. ఒక యూనిట్‌ తేల్చేయగలుగుతుందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. గ్యాస్‌ క్రోమోథెరపీ గ్యాస్‌ మాస్‌ స్పెక్రటోమిట్రీ ఆధారంగా కోవిడ్‌ బారిన పడ్డవాళ్లు శ్వాస నుంచి బయటకు వచ్చే ఐదు కాంపౌండ్లను ఇన్‌స్పెక్ట్‌ఐఆర్‌ బయటపెడుతుంది.

కరోనా మొదలైన చాలాకాలం దాకా స్వాబ్‌ టెస్టులకే ప్రాధాన్యత ఇచ్చాయి చాలా దేశాలు. అయితే టెక్నాలజీ సాయంతో ప్రత్యామ్నాయ పరీక్షలకు ఆస్కారం దొరుకుతోంది ఇప్పుడు. ఇన్‌స్పెక్ట్‌ఐఆర్‌ కొవిడ్‌-19 బ్రీతలైజర్ వినియోగానికి రెండేళ్ల తర్వాత అనుమతులు దొరకడం గమనార్హం.

మరిన్ని వార్తలు