Omicron: అమెరికాలో తొలి ఒమిక్రాన్‌ మరణం.. భయాందోళనలో ప్రజలు

21 Dec, 2021 13:50 IST|Sakshi

వాషింగ్టన్‌:  కరోనా మహమ్మారి రెండు వేవ్‌ల ప్రతాపానికి ప్రపంచదేశాలు అల్లాడిపోయాయి. ఈ జాబితాలో సంపన్న దేశాలు కూడా ఆర్థికం, ఆరోగ్యంగానూ పతనమైన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని నెలలుగా ఈ వైరస్‌ పీడ నుంచి కాస్త ఉపశమనం లభించింది అనుకునేలోపే అమెరికాలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ అలజడి మొదలైంది. తాజాగా అక్కడ తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది.

టెక్సాస్‌లో 50 ఏళ్లు పైబడిన ఓ వ్యక్తి ఒమిక్రాన్‌ సోకడంతో మరణించాడు. అయితే మృతుడు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోలేదని, దాని ప్రభావంతోనే  వైరస్‌ దాడిని తట్టుకోలేక మృతి చందినట్లు తెలుస్తోందని హారిస్ కౌంటీ ఆరోగ్య విభాగం తెలిపింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన శాంపిల్స్‌లో 73 శాతం ఒమిక్రాన్ కేసులున్నట్లు నిర్థారణ అయినట్లు సీడీసీ తెలిపింది. వారం వ్యవధిలో 3 శాతం నుంచి వైరస్ వ్యాప్తి అమాంతం పెరిగి ఈ స్థాయికి చేరడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

గతంలో ప్రధాన వేరియంట్‌గా ఉన్న డెల్టా రకం కేసులు తగ్గుముఖం పట్టాయని అయితే ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపించడం అక్కడి ప్రజలను వణికిస్తోంది. కేసులు కట్టడి చేయలేకపోతే వైద్య సేవలపై తీవ్ర భారం పడనుందని ఆరోగ్య శాఖ అవేదన వ్యక్తం చేసింది. అంతకుముందు డిసెంబరులో, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే బ్రిటన్‌లో మొదటి ఒమిక్రాన్‌ మరణం సంభవించింది. కాగా ‍ప్రస్తుతం బ్రిటన్‌లో 12 మరణాలు నమోదయ్యాయి.

చదవండి: Flower Hair Style: కొప్పున పువ్వులు పెట్టుకోవడం కాదండి..కొప్పునే పువ్వులా దిద్దుకోవడం నయా స్టైల్‌..

మరిన్ని వార్తలు