పలకాబలపం వదిలి.. పలుగూపారా..

11 Aug, 2020 05:51 IST|Sakshi

కోవిడ్‌ సంక్షోభంతో పెరుగుతున్న స్కూల్‌ డ్రాపవుట్లు

భారత్‌లో సమస్య అత్యధికం

అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడి

జెనీవా: కరోనా వైరస్‌ కోరల్లో చిక్కుకొని ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు విలవిల్లాడుతు న్నారు.  కడుపు నింపుకునే మార్గం లేక పలక బలపం బదులుగా పలుగు పార చేతపడుతున్నారు. ఫ్యాక్టరీల్లో చేరుతూ బాల కార్మికులుగా మారుతున్నారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల సంఖ్య చాలా తగ్గుముఖం పట్టింది. కానీ కోవిడ్‌ మహమ్మారి,లాక్‌డౌన్‌ కారణంగా వారి సంఖ్య పెరిగిపోతోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో), ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్‌ ఫండ్‌  అధ్యయనంలో తేలింది. కోవిడ్‌ కారణంగా ఈ ఒక్క ఏడాదే ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకి పడిపోయారు. దీంతో ఆ కుటుంబాలన్నీ తమ పిల్లల్ని బలవంతంగా పనుల్లో పెడుతున్నారు. ఐఎల్‌వో ప్రకారం పేదరికం ఒక్క శాతం పెరిగితే, బాలకార్మికులు 0.7% పెరుగుతారు.

భారత్‌లో 20% డ్రాపవుట్లు
కరోనా వైరస్‌ బట్టబయలు కాక ముందే భారత్‌లో 5.6 కోట్ల మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నారు. వారిలో 1.1 కోట్ల మంది వరకు వ్యవసాయ క్షేత్రంలోనూ, ఫ్యాక్టరీల్లోనూ పనిచేస్తున్నారు. ఇక కరోనా వైరస్‌ సోకిన తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైందని మొదటిసారి బడిలోకి చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గి పోతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన బాలల హక్కుల కార్యకర్త రమ్య సుబ్రమణియన్‌ వెల్లడించారు. ఇళ్లల్లోనే ఉంటూ అగ్గిపెట్టెల తయారీ, ఇళ్లల్లో పనికి కుదురుతూ ఉండడంతో కరోనా సంక్షోభ సమయంలో కొత్తగా ఎందరు స్కూలు డ్రాపవుట్లు ఉన్నారో కచ్చితమైన సంఖ్య చెప్పడం కష్టమని ఆమె చెప్పారు. ప్రతీ అయిదుగురిలో ఒక విద్యార్థి స్కూలు నుంచి డ్రాప్‌ అవుట్‌ అయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేసింది. పూర్తి స్థాయిలో మార్కెట్‌ పుంజుకొని నిర్మాణ రంగం, రైల్వేలు ఇతర ఫ్యాక్టరీలు తెరుచుకుంటే భారత్‌లో దాదాపుగా 20% డ్రాపవుట్లు పెరుగుతాయని ఆ అధ్యయనం వెల్లడించింది. 

మరిన్ని వార్తలు