కరోనా వాక్సిన్: నోవావాక్స్ శుభవార్త   

5 Aug, 2020 10:55 IST|Sakshi

తొలి దశలో నోవావాక్స్  వాక్సిన్ సానుకూల సంకేతాలు

సెప్టెంబరులో  ఫేజ్-3 పరీక్షలు

సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. మరోవైపు కరోనాను నిరోధించే టీకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నోవావాక్స్ సంస్థ కీలక విషయాన్ని ప్రకటించింది. తమ ప్రయోగాత్మక కోవిడ్-19 వ్యాక్సిన్ కరోనాను నిరోధించే యాంటీ బాడీస్ ఉత్పత్తి చేసిందని ప్రకటించింది. కొద్దిపాటి స్థాయిలో నిర్వహించిన ప్రారంభ దశ  క్లినికల్ ట్రయల్స్  ప్రకారం తమ వ్యాక్సిన్ సురక్షితంగా కనిపిస్తోందని తెలిపింది.

మేరీల్యాండ్‌కు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. తమ వ్యాక్సిన్ ఎన్‌విఎక్స్-కోవి 2373, ఆరోగ్యకరమైన వాలంటీర్లలో రెండు మోతాదుల తర్వాత ఫలితాలు సానుకూలంగా  ఉన్నాయని, అత్యధికంగా యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యాయని పేర్కొంది. ఈ ఫలితాల ఆధారంగా తమ వ్యాక్సిన్ విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచేలా అదనంగా అందించిన మ్యాట్రిక్స్ ఎమ్ పదార్ధం, టీకా ప్రభావాన్నిమరింత పెంచుతుందని అధ్యయనంలో తేలిందని తెలిపింది. మే చివరలో ప్రారంభమైన ఈ పరీక్షల్లో, 5 మైక్రోగ్రామ్, 25 మైక్రోగ్రామ్ మోతాదులను పరీక్షించామని తెలిపింది. అమెరికా సహా పలుదేశాల్లో రెండోదశ ట్రయల్స్ నిర్వహిస్తామని తెలిపింది. త్వరలోనే చివరి దశ క్లినికల్ ట్రయల్స్‌ కూడా ప్రారంభిస్తామని నోవావాక్స్ రీసెర్చ్ చీఫ్ గ్రెగొరీ గ్లెన్ తెలిపారు. డిసెంబరు నాటికి రెగ్యులేటరీ ఆమోదం పొందాలని ప్రయత్నిస్తున్నామన్నారు. జనవరి 2021 నాటికి 1 నుంచి 2 బిలియన్ల మోతాదులను అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

కాగా కరోనాకి సంబంధించిన టీకా అభివృద్దికి వైట్ హౌస్ ప్రోగ్రామ్ ఆపరేషన్ వార్ప్ స్పీడ్ అమెరికా నిధులు కేటాయించిన వాటిల్లో నోవావాక్స్ వ్యాక్సిన్ మొదటిది. దీనికి సంబంధించిన ట్రయల్స్, ఉత్పత్తి తదితర ఖర్చులను భరించటానికి నోవావాక్స్ సంస్థకు 1.6 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు అమెరికా ప్రభుత్వం జూలైలో అంగీకరించింది. మరోవైపు దేశంలో వైరస్ కేసుల సంఖ్య 19 లక్షలను దాటేయగా, ప్రపంచవ్యాప్తంగా 695,000 మందికి పైగా ప్రాణాలను బలితీసుకున్న మహమ్మారిని నిలువరించే టీకా కోసం  ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు