ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ ప్రకంపనలు..భారత్‌లోనూ దడ

29 Nov, 2021 14:42 IST|Sakshi

Covid New Variant Omicron: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కెనాడా దేశానికి వ్యాపించింది. నైజీరియా దేశంలో పర్యటించి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు ఒమిక్రాన్‌ సోకడం కలకలం రేపుతోంది. కొత్త వేరియెంట్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఆ ఇద్దరినీ ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దేశంలో పలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.

బ్రిటన్‌లో మూడో కేసు
బ్రిటన్​లో ఒమిక్రాన్ మూడో కేసు నమోదైంది. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. దేశంలో  ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తాజా కేసు సైతం దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుడిలోనే వెలుగుచూసింది. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి లండన్​లో లేడని.. కానీ బయలుదేరే ముందు వెస్ట్‌మిన్‌స్టర్ ప్రాంతంలో కొంతసమయం ఉన్నట్లు గుర్తించినట్లు ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అందువల్ల వైరస్ వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అన్ని బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణాలో ఫేస్ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది. బ్రిటన్​కి వచ్చే విదేశీ ప్రయాణీకులందరూ తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలనే నిబంధనను తప్పనిపరిగా అమలుచేస్తోంది.

భారత్‌లోనూ ఒమిక్రాన్ దడ.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌
భారత్‌లోనూ కరోనా వైరస్‌ ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది.  దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ అని  తేలింది. దక్షిణాఫ్రికా దేశం నుంచి మహారాష్ట్రలోని థానే జిల్లా డోంబివిలీ ప్రాంతానికి ఆ వ్యక్తి  వచ్చాడు. అయితే కరోనా పాజిటివ్‌గా తేలినా ... అతనికి ఒమిక్రాన్ వేరియంట్‌ సోకిందో  లేదో తెలుసుకోవడానికి అతని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. అతనిని కల్యాణ్ డోంబివిలిలోని ఓ ప్రత్యేక ఐసోలేషన్ సెంటరుకు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. వ్యక్తి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిని సైతం ఐసోలేషన్‌లో ఉంచారు.

చదవండి: 270 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ చోరీ! ఆపై ఆ 17 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడంటే..

మరిన్ని వార్తలు