కరోనా మూలాల గుట్టు విప్పిన అధ్యయనం.. వైరస్ పుట్టింది అక్కడే.. కానీ ల్యాబ్‌లో కాదు

27 Jul, 2022 20:16 IST|Sakshi

బీజింగ్‌: కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దాని మూలలపై తీవ్ర చర్చ జరిగింది. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్‌ బయటకు వచ్చిందనే ప్రచారమూ జరిగింది. చైనా మాత్రం దీన్ని ఖండించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్-19 ఎక్కడ పుట్టిందనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే తాజాగా కరోనా మూలాలపై అధ్యయనం చేసిన రెండు నివేదికలు వైరస్ వ్యాప్తి వుహాన్‌లోనే మొదలైందని స్పష్టం చేశాయి. అయితే ఇది కచ్చితంగా వుహాన్ ల్యాబ్‌లో పుట్టలేదని, అదే నగరంలోని సీఫుడ్ మార్కెట్‌ నుంచే దీని వ్యాప్తి మొదలైందని పేర్కొన్నాయి. అడవి జంతువులు, క్షీరదాల విక్రయాలు జరిగే సమయంలో వైరస్ ఉత్పరివర్తనం చెంది మనుషులకు వ్యాపించి ఉంటుందని స్పష్టం చేశాయి. రెండు నివేదికలు అడవిలోని క్షీరదాల్లోనూ సార్స్‌ కోవ్-2 వైరస్ ఉన్నట్లు వెల్లడించాయి.

2019 నవంబర్‌ ముందు వరకు సార్స్‌ కోవ్-2 మనుషులకు వ్యాపించలేదని అధ్యయనం స్పష్టం చేసింది.  2019 డిసెంబర్‌ 20 నాటికి వెలుగు చూసిన తొలి 8 కరోనా కేసులు వుహాన్ సీ ఫుడ్ మార్కెట్ ఉన్న పశ్చిమ ప్రాంతంలోనే నమోదయ్యాయని అధ్యయానాలు పేర్కొన్నాయి.

చైనాలో వెలుగుచూసిన కరోనా ఆ తర్వాత ప్రపంచ దేశాలకు విస్తరించి అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా 60లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పాయరు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాయి.
చదవండి: మంకీపాక్స్‌ అలానే సోకదు... ఒక్కోసారి..: డబ్ల్యూహెచ్‌ఓ

మరిన్ని వార్తలు