Corona Virus: ముగింపు లేదా!?

14 Sep, 2021 03:53 IST|Sakshi

వైరస్‌ సంపూర్ణ నిర్మూలన అసాధ్యమే

అందరికీ ఒక్కసారైనా సోకడం ఖాయం

వ్యాక్సినేషన్‌ పూర్తయితేనే రక్షణ

నిపుణుల అంచనాలు

‘కరోనా కార్చిచ్చులాంటిది.. అడవి మొత్తం తగలబడే వరకు కార్చిచ్చు ఆరదు, అలాగే మానవాళి మొత్తానికి ఒక్కసారైనా సోకే వరకు కరోనా ఆగదు’ అంటున్నారు ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టులు. మానవాళి మరికొన్ని సంవత్సరాల పాటు కరోనాతో ఇబ్బందిపడక తప్పదని హెచ్చరిస్తున్నారు. కరోనా సోకి ఇమ్యూనిటీ పెరగడం కన్నా టీకాలతో ఇమ్యూనిటీ పెంచడం మంచిదంటున్నారు. వ్యాక్సినేషన్‌తోనే దీన్ని అరికట్టడం సాధ్యమని మరోమారు గుర్తు చేస్తున్నారు.

సంవత్సరన్నరకు పైగా ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనాకు నిజంగా ముగింపు ఉందా? ఉంటే ఎప్పుడు? ఎలా? అనేవి ప్రతిఒక్కరిలో తలెత్తే ప్రశ్నలు. కానీ ఇంతవరకు సైంటిస్టులు దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. తాజాగా వచ్చే 3–6 నెలల్లో పరిస్థితులు ఎలా ఉండొచ్చన్న అంశంపై సైంటిస్టులు పరిశోధన జరిపారు. అయితే వచి్చన సమాధానాలు ఏమంత ఆశాజనకంగా లేవని చెప్పారు.

రాబోయే కాలంలో మరలా కరోనా ప్రబలవచ్చని, దీనివల్ల స్కూళ్లు మూతపడడం, టీకాలు తీసుకున్నవారిలో కొత్త ఇన్‌ఫెక్షన్‌ భయాలు పెరగడం, ఆస్పత్రులు కిటకిటలాడటం జరగవచ్చని హెచ్చరించారు. కరోనాకు నిజమైన ముగింపు వచ్చే లోపు ప్రపంచంలో ప్రతిఒక్కరూ దీని బారిన ఒక్కసారైనా పడటం లేదా టీకా తీసుకోవడం జరుగుతుందన్నారు. కొందరు దురదృష్టవంతులకు రెండుమార్లు కరోనా సోకే ప్రమాదం కూడా ఉండొచ్చన్నారు. అందరికీ కరోనా సోకేవరకు వేవ్స్‌ రాకడ ఆగకపోవచ్చని అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం, తిరిగి తగ్గడం గమనించవచ్చని అమెరికా సైంటిస్టు మైకేల్‌ ఓస్టర్‌ హామ్‌ అభిప్రాయపడ్డారు.  

మ్యుటేషన్లతో ప్రమాదం
వైరస్‌ల్లో వచ్చే మ్యుటేషన్లు(ఉత్పరివర్తనాలు) కొత్త వేరియంట్ల పుట్టుకకు కారణమవుతాయన్నది తెలిసిందే! కరోనాలో మ్యుటేషన్‌ మెకానిజం ఇతర వైరస్‌లతో పోలిస్తే మెరుగ్గాఉంది. గత వేరియంట్లలో లోపాలను దిద్దుకొని కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయి. ఇందువల్ల రాబోయే కాలంలో ఫ్లూలాగానే ఎప్పటికప్పుడు కరోనాకు టీకా (బూస్టర్‌ డోస్‌లు) టాప్‌అప్‌లు తీసుకోవాల్సిరావచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. కొన్ని మ్యుటేషన్ల అనంతరం ఫస్ట్‌జనరేషన్‌ వ్యాక్సిన్లను తట్టుకునే వేరియంట్‌ రావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదేకాకుండా కొత్త రకం ఫ్లూ వైరస్‌ మానవాళిపై దాడి చేసే అవకాశాలు లేకపోలేదని ప్రముఖ శాస్త్రవేత్త కంటా సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా 5,6 నెలల్లో మాత్రం కరోనా మాయం కాకపోవచ్చని సైంటిస్టుల ఉమ్మడి మాట. ప్రపంచ జనాభాలో 95 శాతం వరకు ఇమ్యూనిటీ(కరోనా సోకి తగ్గడం వల్ల లేదా టీకా వల్ల) వస్తేనే కోవిడ్‌ మాయం అవుతుందని చెబుతున్నారు. హెర్డ్‌ ఇమ్యూనిటీకి అత్యుత్తమ మార్గం వ్యాక్సినేషనేనని చెప్పారు. కరోనా ముగింపు ప్రపంచమంతా ఒకేదఫా జరగకపోవచ్చని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో(టీకా కార్యక్రమం పూర్తికావడం బట్టి) కరోనా మాయం అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఏం జరగవచ్చు
ఒకపక్క కోట్లాదిమందికి టీకా అందలేదు, మరోపక్క ఆర్థిక వ్యవస్థలు చురుగ్గా మారుతున్నాయి. ఈ రెండింటి సమ్మేళనంతో మరలా కేసులు పెరగవచ్చని మైకేల్‌ అంచనా వేశారు. టీకా కార్యక్రమాల వేగం పెరిగినా, వైరస్‌ బారిన పడే ప్రమాదం ఉన్నవారు(ఉదాహరణకు పసిపిల్లలు, టీకా అందని వారు, బ్రేక్‌థ్రూ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడేవారు) ఎప్పుడూ ఉంటారన్నారు. రాబోయే కొన్ని నెలలు ప్రమాదమని, ముఖ్యంగా టీకా నిరోధక వేరియంట్‌ వస్తే మరింత ప్రమాదమని సైంటిస్టుల అంచనా. 130 ఏళ్ల క్రితం మనిíÙని ఐదుమార్లు వణికించిన ఇన్‌ఫ్లుయెంజా మహమ్మారి ఉదంతాన్ని గమనిస్తే కరోనా భవిష్యత్‌పై ఒక అంచనా రావచ్చని భావిస్తున్నారు.

వీటిలో ఒక దఫా సుమారు ఐదేళ్లు మానవాళిని పీడించింది. ఆ ఐదేళ్లలో 2–4 వేవ్స్‌ వచ్చాయి. దీనికన్నా కరోనా ప్రమాదకారని, కనుక థర్డ్‌వేవ్‌ తప్పదని లోనే సిమన్‌సన్‌ అనే సైంటిస్టు అభిప్రాయపడ్డారు. అధిక వ్యాక్సినేషన్లు, ఆధునిక సౌకర్యాలున్న అగ్రరాజ్యాల్లో సైతం మరలా కేసులు పెరుగుతున్న సంగతి గుర్తు చేశారు. టీకాల వల్ల మరణాలు తగ్గవచ్చని, కానీ కేసులు పెరగడం ఆగకపోవచ్చని చెప్పారు. ముఖ్యంగా టీకాలు పెద్దగా కనిపించని మెక్సికో, ఇరాన్‌ లాంటి దేశాల్లో డెల్టాతో డేంజర్‌ పెరగవచ్చని చెప్పారు. టైమ్‌ గడిచేకొద్దీ వైరస్‌లు బలహీనపడతాయన్న అపోహ వద్దన్నారు.

  – నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు